స్క్రబ్ టైఫస్ వచ్చిన వ్యక్తి చేతిపై దద్దుర్లు
స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు ఉంటేనే టెర్రర్ పుడుతోంది. మూడేళ్లుగా జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాతా టైఫస్ జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిజేస్తున్నాయి. ఈ తరహా జ్వరాల బారిన పడిన రోగులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి సైతం నగరానికి వచ్చి పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు.
లబ్బీపేట(విజయవాడ తూర్పు) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో జ్వరాలు విజృంభించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, పలువురికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది కూడా ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని సమాచారం. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సైతం పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు సైతం కోల్పోతారని అంటున్నారు. తొలుత అకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్లరక్తకణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
వ్యాధి ఎలా సోకుతుందంటే...
దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో ఉండే ‘త్సుట్సుగామూషి ’ అనే కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారు. త్సుట్సుగామూషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా రావడం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్దారించేందుకు ఎలిసా పరీక్షలు సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి.
వ్యాధి ప్రభావం....
స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. అంతేకాకుండా కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం , తెల్లరక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు.
ఎవరికి ప్రమాదకరం....
స్క్రబ్ టైఫస్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా హెచ్‌ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది.
స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయి
స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారు మూడేళ్లుగా తమ ఆస్పత్రికి వస్తున్నారు. గత ఏడాది కూడా ఇద్దరు చిన్నారులకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష„ý అందుబాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు.డాక్టర్ పాతూరి వెంకట రామారావు,పీడియాట్రిక్ చీఫ్, ఆంధ్రా హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment