సుజలం.. విఫలం! | People Suffering Water Problems In Prakasam | Sakshi
Sakshi News home page

సుజలం.. విఫలం!

Published Tue, Jul 17 2018 1:01 PM | Last Updated on Tue, Jul 17 2018 1:01 PM

People Suffering Water Problems In Prakasam - Sakshi

గిద్దలూరులో నీటి కోసం ట్యాంకర్‌ను చుట్టు ముట్టిన మహిళలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా జిల్లా వాసులకు ఇప్పట్లో తాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నా ఈ పథకం  ఎప్పటికి అమలు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.  జిల్లాలో ప్రతి ఇంటికి రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాలుగు సంవత్సరాల పాలన ముగుస్తున్నా ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల మొదటి విడతగా పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, కందుకూరు నియోజక వర్గాల్లో 18 మండల కేంద్రాల్లో రూ.30,18,16 కోట్ల చొప్పున రూ.64.01 కోట్లతో మూడు ప్యాకేజీలుగా శుద్ధ జల కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. సింగిల్‌ టెండర్‌ మాత్రమే దాఖలు కావడంతో అధికారులు టెండర్లను రద్దు చేశారు. తిరిగి టెండర్లు ఎప్పటికి నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. దీంతో ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా జిల్లా వాసులకు సురక్షిత తాగు నీరు కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.

ఫ్లోరైడ్‌ ప్రాంతాలకూ దిక్కులేదు..
ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోలు, సీఎస్‌పురం, దొనకొండ, దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, తర్లుపాడు, యర్రగొండపాలెం, దర్శి, ముండ్లమూరు, పీసీపల్లి, పొదిలి, కందుకూరు తదితర 18 మండల కేంద్రాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. వాస్తవానికి శుద్ధ జల కేంద్రాలకు పుష్కలంగా నీరు అవసరం. గంటకు 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న బోరుబావులుతవ్వాల్సి ఉంది. అలా అయితేనే 10 వేల లీటర్ల సురక్షిత నీరు వస్తుంది. అప్పుడే ప్రజలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. పశ్చిమ ప్రకాశంలో పుష్కలంగా నీరున్న ప్రాంతాలు  అరుదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకట్రెండు చోట్ల నీరున్న ప్రాంతాలు దొరికినా.. బోరు బావుల తవ్వకం, శుద్ధజల కేంద్రాల ఏర్పాటు, మారుమూల గ్రామాలకు పైప్‌లైన్ల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ లెక్కన ఫ్లోరోసిస్‌ ప్రాంతాలకు ఎన్‌టీఆర్‌ సుజలం పేరుతో సురక్షిత నీరు అందిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

పశ్చిమలో నీటి కష్టాలు అధికం..
జిల్లాలో 8,60,423 కుటుంబాల పరిధిలో 33,97,448 జనాభా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి అడుగుల మేర బోరుబావులు తవ్వినా నీరు దొరికే పరిస్థితి లేదు. పైగా ఆ స్థాయిలో  భూగర్భ జలం అరకొరగా పైకి వచ్చినా ప్లోరైడ్‌ శాతం అధికంగా ఉంటుంది. నీటిని తాగితే ప్లోరోసిస్‌తో పాటు కిడ్నీ వ్యాధికి గురికావాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే జిల్లాలో వందలాది మంది  మృతి చెందగా వేలాది మంది వ్యాధికి గురై బాధ పడుతున్నారు.  పథకం ద్వారా తాగు నీరందుతుందని అందరూ ఎదురు చూశారు.

పథకాన్ని పట్టించుకోని ప్రభుత్వం
ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆదిలోనే గాలి కొదిలేసింది. దీనిపై విమర్శలు రావడంతో దాతలను వెతికి పథకాన్ని నడిపించాలని ప్రభుత్వం గ్రామీణ తాగునీటి పథకం అధికారులను ఆదేశించింది. ఈ ప్రయత్నం వికటించడంతో పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీతో పాటు అన్ని పక్షాలు  విమర్శల దాడి పెంచడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కానీ ఈ పథకం ఇప్పట్లో అమలుకు నోచుకొనేలా కనిపించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement