
కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా బలయ్యారు. అదేవిధంగా భారత్‌లో కూడా అనేక మంది మరణించారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో దానిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ మొదట మూడువారాల పాటు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించారు. అయితే కరోనా కేసులు దేశంలో నానాటికి పెరిగిపోతుండటంతో అన్ని రాషష్టట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం మే3 వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు మోదీ ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా చాలా మంది పేదవారు ఉపాధిని కోల్పొయారు. ఒక్కపూట భోజనం కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా... ఆ ఫలాలు కొందరికే అందుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సామాన్యులు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తూ పేదవారి కడుపునింపుతున్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న కొంత మంది వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయవాడ కానూరు మదీనాలో ఉంటున్న అబ్దుల్ రహమాన్ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తనకు తోచిన సాయాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన ఇంట్లో అద్దెకు ఉండేవారికి రెండు నెలల అద్దె మినహాయించారు. దాంతో పాటు తమ ఇంటికి చుట్టు పక్కల ఉండే పేదలకు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యవసర సరుకులు పంచి పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.
హనీ వెల్ టెక్నాలజీ సొల్యూషన్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు చందనా నగర్‌లో ఉన్న అనాధాశ్రమానికి నిత్యవసర సరుకులు, బియ్యం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఒంగోలు జిల్లా నల్లగండ్లకు చెందిన వెంకట రామకృష్ణ రెడ్డి తమ చుట్టు పక్కల ఉండే ప్రతి పేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ వంట నూనె, ఒక కిలో పప్పును అందించారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి అండగా నిలిచారు.
గుంటూరు జిల్లా చల్లగుండ్ల అడ్డరోడ్డులో ఉంటున్న నాగార్జున తన ఇంటి చుట్టుపక్కల ఉండే పేదవారికి, నిరాశ్రయులకు, రోజు వారి కూలీలకు కూరగాయలు పంపిణీ చేసి వారికి తన వంతు సాయాన్ని అందించి దయ గుణాన్ని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment