
ఏలూరులో ‘బీసీ గర్జన’ సభ జరగనున్న ప్రాంగణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే కోలాహలం. దారులన్నీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైపే దారి తీస్తున్నాయి. తమ సమస్యలపై గళమెత్తుతున్న బీసీలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రాంగణంలో ఆదివారం నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభ దిశగా కదులుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ సంక్షేమం కోసం ఏ ప్రకటనలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ప్రకటించనివిధంగా జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయన్న కొండంత విశ్వాసం ప్రకటిస్తున్నారు.
చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
జిల్లా జనాభా 56 లక్షలు కాగా, ఇందులో బీసీలు 32.60 లక్షల మంది ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తమకు 115కి పైగా హామీలిచ్చి, ఏ ఒక్కటీ అమలు చేయలేదని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీసీల్లో రజకులను, నాయీ బ్రాహ్మణులను, బోయిలను, మత్స్యకారులను, ఇతర కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చుతామని, గాండ్లు, సగర, పూసల, కురబ, బోయ, పద్మశాలి తదితర కులాలను బీసీ–డి నుంచి బీసీ–ఎకు మార్చుతామని చెప్పి, తర్వాత మోసం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా, వాటిని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులపైన, నాయీ బ్రాహ్మణులతోపాటు ఇతర కుల సంఘాల నాయకులపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చూపుడువేలెత్తి మరీ భయపెట్టారు. గత ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానని ప్రకటించారు. దీని ప్రకారం నాలుగున్నరేళ్లలో రూ.40 వేల కోట్ల నిధులివ్వాల్సి ఉండగా కేవలం రూ.7 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
టీడీపీ వంచనకివిగో ఉదాహరణలు
♦ జిల్లాలో ఆదరణ పథకం కోసం 80 వేల దరఖాస్తులు రాగా 15,210 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు.
♦ జిల్లాలో 82,584 మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.269 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, రూ.87.73 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
♦ బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ నిధులు రూ.46.12 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ.30.02 కోట్లు మాత్రమే ఇచ్చారు.
♦ జిల్లాలో ఒకప్పుడు 44 బీసీ హాస్టళ్లు ఉండగా, దశలవారీగా 15 మూసేశారు. దీంతో వేలాదిగా బీసీ విద్యార్థులు అర్ధాంతరంగా తమ చదువుకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కావడంతో కంటితుడుపు చర్యలతో హడావుడి చేస్తున్నారని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
నూతనోత్సాహంతో ‘బీసీ గర్జన’కు..
టీడీపీ చేసిన, చేస్తున్న మోసాన్ని గ్రహించిన బీసీలు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. వెనుకబడిన వర్గాల్లోని ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వారి సమస్యలపై పాదయాత్రలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఈమేరకు హామీ ఇచ్చారు. శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, శ్రీశయన, యాదవ, కురుబ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ, వన్నికుల క్షత్రియ, తూర్పుకాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, గాండ్ల, చేనేత కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించారు. బీసీల్లోని వివిధ కులవృత్తుల వారికి నిర్దేశిత యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక పింఛన్లు, ఇళ్లు, ఇతరత్రా సాయంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.
హామీలివ్వడమే కాదు ప్రమాణపూర్వకంగా అమలు చేసే ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు. కొన్ని నెలలుగా బీసీ సమస్యలపై అధ్యయనంపై చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ బీసీ డిక్లరేషన్ రూపొందించారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఇచ్చిన హామీలు బీసీలకు ఎంతో నమ్మకం కలిగించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని ఇప్పటికే పలు బీసీ సంఘాలు ప్రకటించాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందని, ఆయన ఆశయ సాధన కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా తమకు మరింత మేలు చేస్తారని బీసీలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు బీసీ గర్జనకు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బస్సులు, ఇతర వాహనాలపై ఏలూరుకు వేలాదిగా పయనమవుతున్నారు. ఏలూరు బీసీ గర్జన సభ మరో చరిత్రకు నాంది పలుకుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment