పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ వర్తించలేదంటూ ..
బేస్తవారిపేట: పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ వర్తించలేదంటూ బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్ల స్టేట్ బ్యాంక్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. మండలంలోని పిటికాయగుళ్ల, వంగపాడు, జేసీ అగ్రహారం గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రుణాలు తీసుకున్న రైతులు రైతు సాధికారత సదస్సుకు వచ్చారు. రుణమాఫీ వర్తించకపోవడంతో అర్జీలు ఇవ్వడానికి సదస్సుకు హాజరయ్యారు. మీ సేవలో అర్జీలు పెట్టుకోవాలని డీటీ కె.నాగేశ్వరరావు రైతులకు సూచనలిచ్చారు.
బ్యాంక్‌లో ఆధార్, రేషన్‌కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను సకాలంలో అందజేసిన వందల మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని, బ్యాంక్ అధికారులు సక్రమంగా నమోదు చేయలేదని ఆవేదన చెందిన రైతులు సదస్సు పక్కనే ఉన్న బ్యాంక్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఒకసారి బ్యాంకులో, రెండోసారి వీఆర్వోకు రుణమాఫీకి సంబంధించిన పత్రాలన్నీ అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
రుణమాఫీ పత్రాలు పంపిణీకి సిబ్బంది సిద్ధం కావడంతో ‘వీటితో ఏమి చేసుకోవాలని’ పలువురు రైతులు ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి అకౌంట్‌లో పడలేదు, పత్రాలు పూజ చేసుకోవడానికా, ఎవరు చెప్పారు నగదు జమైందంటూ ఎదురు తిరిగారు. ఆ పత్రాలు పట్టుకొని వీరంతా బ్యాంకు వద్దకు వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.