
నిరసనోధృతి
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జనం కదంతొక్కారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతటా ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
సాక్షి, విజయవాడ :
రాష్ట్ర విభజనపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా జరిగాయి. జగ్యయ్యపేటలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహించారు. వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు సమైక్యాంధ్ర జెండాలు పట్టుకొని తెలంగాణ, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయభాను ఇంటివద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ బంగారుకొట్ల సెంటర్, ముక్త్యాల రోడ్డు, బలుసుపాడు సెంటర్‌కు చేరుకుని అక్కడ మానవహారం నిర్మించారు. అవనిగడ్డలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్‌లో ఎన్‌ఆర్‌ఐ ఇండియన్ స్ప్రింగ్స్ హైస్కూల్ విద్యార్థులతో మానవహారం నిర్మించారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్‌ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారానికి 126వ రోజుకు చేరాయి. పార్టీ పిలుపు మేరకు భారీగా విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. నందిగామలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నందిగామ పట్టణంలో పలు ప్రధాన
కూడళ్లలో కొనసాగింది. తిరువూరులో పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడు జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు మంగళవారం నాటికి 106వ రోజుకు చేరాయి. ఈ శిబిరాన్ని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. ఈ శిబిరంలో పట్టణ ంలోని రామాయమ్మరావుపేటకు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఈ శిబిరాన్ని మంగళవారంతో ముగిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రతాప్ తెలిపారు.
విజయవాడలో...
విజయవాడలో స్థానిక గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ మానవహారం నిర్మించారు. కళాశాల విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.