సమైక్యాంధ్ర పోరాటానికి జేఏసీల బాసట
సాక్షి, ఏలూరు:
జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అగ్నిగుం డంలా మండుతోంది. దశదిశలా దావానలంలా వ్యాపిస్తోంది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ ఉవ్వెత్తున సాగుతోంది. 37 రోజు లుగా ఉద్యమం ఇంత సుస్థిరంగా ముందుకు సాగడానికి రాజకీయ నాయకుడో, పార్టీయో కారణం కాదు. ప్రజలే నాయకులై.. తమను తామే నడిపించుకుంటూ.. వారికి వారే దిశానిర్దేశం చేసుకుంటూ ఉద్యమాన్ని దౌడు తీరుుస్తున్నారు. ప్రతి సామాన్యుడు నాయకుడిగా మారడం.. వారి ఉమ్మడి అజెండా సమైక్యాంధ్ర కావడంతో ఉద్యమ తీవ్రత కొంచెమైనా తగ్గలేదు. ఒక్కొక్కరు కలిసి వేలు, లక్షలాదిగా విభజన నిర్ణయంపై దండెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే
సంయుక్త కార్యాచరణ సమితులు (జేఏసీలు) ఏర్పడ్డారుు. ఎక్కడికక్కడ లెక్కకు మిక్కిలిగా జేఏసీలు ఏర్పాటై ఉద్యమానికి ఊతకర్రగా నిలుస్తున్నారుు. వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి మధ్య భేషజాలు లేవు. గ్రూపు రాజకీయాలు లేవు. వ్యక్తిగత డిమాండ్లు, స్వప్రయోజనాలు లేవు. మరీముఖ్యంగా జేఏసీలను నడిపిస్తున్న వారెవరూ పేరుకోసం కనీస స్థారుులో కూడా వెంపర్లాడటం లేదు. ఉమ్మడి ప్రణాళికతో.. ఉమ్మడి లక్ష్యం కోసం అంతా ఏకమై పోరాటం సాగిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, వృత్తిదారులు, రైతులు, కార్మికులు, కూలీలు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అనేక వర్గాలవారూ జేఏసీలుగా ఒకేతాటిపైకి వచ్చారు.
‘సమైక్య’ సారథులు
జిల్లా మొత్తం మీద 76 ప్రభుత్వ శాఖలకు చెందిన 45,155 మంది ఏపీ ఎన్జీవోలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. గతనెల 12 నుంచి వారంతా సమ్మె చేపట్టి, జీతాలు రాకపోయినా సొంత ఖర్చులతో ఉద్యమంలో పాల్గొంటున్నారు. 3 వేల మంది ఉద్యోగులున్న ఆర్టీసీలోని అన్ని యూనియన్లు జేఏసీగా ఒకేతాటిపైకి వచ్చారుు. 20 రోజులు దాటినా బస్సులను డిపోలకే పరిమితం చేశారుు. 17వేల మంది ఉపాధ్యాయులు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఉపాధ్యాయ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. 2,400 మంది విద్యుత్ ఉద్యోగులు తమ యూనియన్లను ఏకం చేసి జేఏసీని రూపొందించారు. జిల్లా విద్యార్థి కార్యాచరణ సమితిగా ఏర్పడి విద్యార్థులు గర్జిస్తున్నారు. గృహనిర్మాణ సంస్థ, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సిబ్బంది, ప్రైవేట్ విద్యాసంస్థలు, పశు సంవర్థక శాఖ, రెవెన్యూ ఉద్యోగులు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు జేఏసీలుగా రూపొందాయి. వర్తక, వాణిజ్య, వృత్తి సంఘాలు జేఏసీలుగా ఏర్పడి సమైక్యాంధ్ర కోసం చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారుు.
ఎక్కడికక్కడ నాన్ పొలిటికల్ జేఏసీలు ఏర్పడ్డారుు. రాజకీయ పార్టీలు, జెండాలు, అజెండాలకు అతీతంగా ఉద్యమం సాగుతోంది. టాక్సీలు, ఆటోలు, లారీల అసోసియేషన్లు, చిల్లర వర్తకులు, తోపుడు బండ్ల వ్యాపారులు, మత, కుల సంఘాలు ఒకే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. న్యాయవాదుల జేఏసీలు సమైక్య ఉద్యమంలో పాల్గొనడంతోపాటు ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెడితే స్వచ్ఛందంగా వాదిస్తామని ప్రకటించారు. రైతాంగ సమాఖ్య, రైతు కార్యాచరణ సమితి, రైతు వేదికల ఆధ్వర్యంలో కర్షకులూ ముందుంటున్నారు.
చందాలు వేసుకుని...
తెలంగాణ ఉద్యమంలో అక్కడి వారు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి చందాలు వసూలు చేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇక్కడ ఆ పరి స్థితి లేదు. ఇక్కడ భారీ పరిశ్రమలు, బడా వ్యాపారులు లేరు. ఉద్యమంలో పాల్గొనే ప్రతి పౌరుడు తన జేబులోని డబ్బునే ఖర్చు చేస్తున్నాడు. జేఏసీ సభ్యులు ఎవరికి వారు చందాలు వేసుకుంటున్నారు. తమ సంక్షేమం కోసం సంఘంలో దాచుకున్న సొమ్మును వినియోగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మరే ఇతర పార్టీలు బాసటగా నిలవడం లేదు. కాంగ్రెస్, టీడీపీ స్థానిక నేతలు అడపాదడపా ఆందోళనల్లో పాల్గొని చేతులు దులిపేసుకుంటున్నారు.