హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : విష జ్వరం బారిన పడి ఓ యువకుడు ప్రాణాన్ని కోల్పోయాడు. మండలంలోని గోవర్ధనగిరికి చెందిన లింగాల రాజయ్య(35) వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఆయనకు భార్య సరస్వతి, ముగ్గురు కూతుళ్లు మహేశ్వరి(6), ప్రావీణ్య(4), ఆరు నెలల లాస్య ఉన్నారు. కూలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య మృతితో భార్యాపిల్లలు వీధిన పడ్డా రు. వారం రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆసుపత్రికి వెళ్లినా తగ్గలేదు.
వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ ఇంట్లోనే ఉన్నాడు. రాఖీపౌర్ణమి రోజున ఆయన భార్య ఆమె తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు పిల్లలను తీసుకొని పుట్టినూరు కుందెనవానిపల్లెకు వెళ్లింది. గురువారం ఆమెను తీసుకువచ్చేందు కు రాజయ్య జ్వరంతోనే వెళ్లాడు. ఆ రోజు రాత్రి అక్కడే మృతిచెందాడు. దీంతో ఆయన భార్యాపిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. శుక్రవారం ఉదయం రాజయ్య మృతదేహాన్ని గోవర్ధనగిరికి తీసుకువచ్చారు. పెద్ద కూతురు మహేశ్వరి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. చిన్న వయసులోనే తండ్రికి దూరమైన ఆ చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తుండడం అందరినీ కలచివేసింది. నాన్నా.. నన్నెవలు ఎత్తుకుంటారు.. అని మహేశ్వరి ఏడవడం అక్కడున్నవారి హృదయాలను బరువెక్కించి, కన్నీళ్లు పెట్టించింది.
అక్కన్నపేటలో విద్యార్థిని..
హుస్నాబాద్ రూరల్ : మండలంలోని అక్కన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని గంగారపు మౌనిక(18) శుక్రవారం విషజ్వరంతో మృతి చెందింది. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను తల్లిదండ్రులు శోభ, వెంకటయ్య స్థానిక ఆరెంపీకి చూపించారు. ఆయన ఇచ్చిన మందులు వాడుతున్నారు. అయినా జ్వరం తగ్గలేదు. శుక్రవారం జ్వరం ఎక్కువ కావడంతో మౌనిక మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నన్నెవలు ఎత్తుకోవాలె నాన్నా..
Published Sat, Aug 24 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement