కుక్కునూరు, న్యూస్‌లైన్: నిన్నమొన్నటి వరకు వరద ముంపుతో బాధపడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. గోదావరి వరద కారణంగా చేతి పంపు నీరు కలుషితమై ఆ రెండు గ్రామాలలో 50 మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో 30 మంది వరకు మంచాలకే పరిమితం కాగా మిగిలిన వారు కడుపు నింపుకునేందుకు తప్పని పరిస్థితుల్లో కూలి పనులకు వెళ్తున్నారు. బాధితుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుక్కునూరు మండల కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు లచ్చిగూడెం, చింతలగుంపు. ఇటీవల గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఈ రెండు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆ రెండు గ్రామాల్లోని వంద కుటుంబాలకు తాగునీటిని అందించే చేతి పంపు కూడా ముంపునకు గురైంది. వరదలు తొలగిన తర్వాత ఆ చేతి పంపు నీటిని తాగిన సుమారు 50 మంది గిరిజనులు జలుబు, జ్వరాల బారిన పడ్డారు. వారిలో 30 మంది మంచంపై నుంచి కదలలేని స్థితిలో ఉన్నారు. మడకం శంకర్, కారం లక్ష్మయ్య కుటుంబాలకు చెందిన 10 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బాధితులే :
లచ్చిగూడెం గ్రామంలో మూడేళ్ల వయసున్న చిన్నారుల నుంచి డెబ్బై సంవత్సరా వయసున్న వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. శంకర్, మారెమ్మ దంపతులు, వారి కుమారులు మూడేళ్ల వయసున్న మడకం కార్తీక్, నాలుగేళ్ల వయసున్న రామ్‌చరణ్‌లతో జ్వరాలతో బాధపడుతున్నారు. అదేగ్రామానికి బరపటి రమేశ్, వర్సా మల్లిక, బొద్దుల ప్రసాద్ జ్వరాలతో బాధపడుతున్నారు. మరోపక్క తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కారం వెంకన్నబాబు తప్పని పరిస్థితుల్లో గేదెలు కాయడానికి వెళ్తున్నాడు. మచ్చా భీమమ్మ, తెల్లం సూరమ్మలు కూలీపనులకు వెళ్తున్నారు. కాగా కారం అక్కమ్మతోపాటు ఆమె కుమార్తెలు మంజుల, కుమారిలకు వారం రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. అదేవిధంగా చింతలగుంపు గ్రామానికి చెందిన మడకం తూలయ్య, మంగరాజు, కన్నమ్మ, అచ్చమ్మలతోపాటు మరో ఇద్దరు కూడా విషజ్వరాలబారినపడ్డారు.
తెల్ల, ఎర్రరంగు మాత్రలు ఇస్తున్నారు
లచ్చిగూడెం, చింతలగుంపు గ్రామాలు కుక్కునూరు మండలంలోనివే అయినప్పటికీ మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో సమీపంలో ఉన్న వేలేరుపాడు మండల పీహెచ్‌సీకి కేటాయించారు. వేలేరుపాడు పీహెచ్‌సీకి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలకు వచ్చే ఏఎన్‌ఎంలు ఎర్ర, తెల్లరంగు మాత్రలు మాత్రమే ఇచ్చి వెళ్తున్నారని, అవి వాడినా జ్వరాలు తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు.
వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 50 మందిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రక్త పరీక్షలు చేయలేదని, సెలైన్ బాటిళ్లు ఎక్కించి వెళ్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై వేలేరుపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఆ రెండు గ్రామాల్లో జ్వరపీడితులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. శనివరం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు.
విజృంభిస్తున్న విషజ్వరాలు
Published Sat, Aug 10 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement