సాక్షి, వాకాడు: టీడీపీ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో టీడీపీపై నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ పాలనలో వర్షాలు లేకపోవడం..పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం..సాగునీటిని సకాలంలో అందించడంలోనూ విఫలమవడంతో రైతులు వారి సంక్షేమాన్ని కాంక్షించే పాలకులు రావాలని కోరుకుంటున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వోద్యోగులు, నిరుద్యోగులు, సామాన్యులు, కూలీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ దఫా మార్పు కోసం టీడీపీకి వ్యతిరేకంగా తమ ఓటు వేసి ప్రజలు తీర్పు ఇవ్వనున్నట్లు పలు సర్వేల ద్వారా ఇప్పటికే వెల్లడైంది. దివంగత సీఎం వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు, సమస్యలను అవగతం చేసుకున్నారు. ప్రజారంజకంగా పాలన సాగించాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారు. ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
మార్పుతోనే అభివృద్ధి సాధ్యం
ఐదేళ్లకొకసారి ప్రభుత్వం మార్పు జరిగి తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. వరుసగా ఒకరినే ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి జరగదు. అందుకే ఈ దఫా ఎన్నికల్లో నాయకత్వ మార్పును కోరుకుంటున్నాం. యువనేత అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాం.
– దువ్వూరు భార్గవ్‌రామ, వాకాడు
అభివృద్ధి ప్రదాతకే ఓటు
ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పెద్దగా జరగలేదు. ఎక్కడ చూసినా ప్రజలు కరువు కష్టాలతో అల్లాడిపోతున్నారు. ఈ దఫా ప్రభుత్వం మారి యువ నాయకుడు సీఎం అయితే అభివృద్ధి ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో మార్పును కోరుకుంటున్నాను.
– రాజా, వాకాడు.
యువ నాయకత్వానికే పట్టం
రాజకీయంగా ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పాలనలో విఫలమయ్యారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారు. జన్మభూమి కమిటీలతో పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చూశారు. అందుకే ఈ ఎన్నికల్లో యువ నాయకత్వానికి వేటు వేయాలనుకుంటున్నా.
– ఎం రజిత
ప్రత్యేక హోదా కోసం పోరాడే వారికే మద్దతు
ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని. ప్రత్యేక హోదాతో రాయితీలు లభించి పరిశ్రమలు వస్తాయి. తద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడే వారికే మద్దతు ఇవ్వాలనుకుంటున్నా.
–ఎం. వెంకటరమణయ్య
Comments
Please login to add a commentAdd a comment