టన్నుకు రూ. 200 బోనస్ | Per tonne. 200 Bonus మద్దతు ధర | Sakshi
Sakshi News home page

టన్నుకు రూ. 200 బోనస్

Published Tue, Oct 1 2013 2:21 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

Per tonne. 200 Bonus మద్దతు ధర

చోడవరం, న్యూస్‌లైన్: గోవాడ చక్కెరకర్మాగారం సభ్య రైతులకు టన్నుకు రూ.200లు బోనస్‌గా చెల్లించనున్నట్టు పాలకవర్గం ప్రకటించింది. ఏడేళ్ల అనంతరం రైతు ప్రతినిధుల మధ్య 43వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణలో చైర్మన్ గూనూరు మల్లునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగింది. సభలో మద్దతు ధరే ప్రధానాంశమైంది. రైతులు, నాయకులు దీనిపైనే చర్చించారు. పెట్టుబడులు బాగా పెరిగినందున గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ముక్తకంఠంతో కోరారు. 2012-13 సీజన్ నివేదికను అధికారులు సభ ముందు ఉంచారు.

చైర్మన్ మాట్లాడుతూ సాగులో ఆధునిక పద్ధతులు పాటించకపోవడంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. రాయితీపై ఫ్యాక్టరీ కల్పిస్తున్న సోలార్ పద్ధతి, రుణం బోర్ల ఏర్పాటు వంటివాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వడ్డీ లేని రుణాలకు చర్యలు చేపట్టామన్నారు. మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ మద్దతు ధరకు ఫ్యాక్టరీతో పాటు ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు. కెపాసిటీకి తగ్గట్టుగా గానుగాడాలని సూచించారు. వైఎస్ చనిపోవడం వల్లే రాష్ట్రానికి, సుగర్‌ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు టన్నుకు రూ. 2500లు చెల్లించాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తక్కువ ధరకు  ప్రభుత్వానికి అమ్మే బదులు ఎక్కువ ధరకు ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తే మంచిదని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సహకార చక్కెర కర్మాగారాలకు మంచి జరిగిందన్నారు. టన్నుకు రూ. మూడువేలు  ఇస్తే తప్ప రైతులకు గిట్టుబాటు కాదన్నారు.

మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ పాలకమండలి ఉంటేనే రైతులకు జవాబుదారీతనం ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు మాట్లాడుతూ టన్నుకు రూ.2500లు ఇవ్వాలని, రికవరీ పెంపునకు కృషి చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ఎండీ మజ్జి సూర్యభగవాన్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గాలు నిర్ణయం తీసుకోవాలన్నారు. సభలో పలువురు రైతులు మద్దతు ధరపై, రైతు సమస్యలపై మాట్లాడారు. సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు, సుగర్‌ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కొప్పాక వెంకటరావు, డెరైక్టర్లు దొగ్గ ఉమాశంకర్, కురచా నర్సింహారావులు పాల్గొన్నారు.
 
 తీర్మానాలు
 2012-13 సీజన్‌కు సంబంధించి టన్నుకు రూ. 200లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూ. 200లు ప్రభుత్వం ఇవ్వాలని ప్రతిపాదించారు.
 
 మూడేళ్లకు సంబంధించిన డివిడెండ్ రూ. 2.6 కోట్లు రైతులకు పంపిణీకి నిర్ణయించారు.
 
 సుగర్, మొలాసిస్, ఎరువుల నిల్వలకు మూడు గోడౌన్ల నిర్మాణానికి తీర్మానించారు.
 
 నేషనల్ ఫెడరేషన్ ద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి నిర్ణయించారు.
 
 అధీకృత మూలధనానికి రూ.30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచేందుకు నిశ్చయించారు
 
  ఎండీ మజ్జి సూర్యభగవాన్‌ను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ప్రతిపాదించారు.  
 
 కో-జనరేషన్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను అధిక ధరకు విక్రయించాలని తీర్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement