సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల్లోనే కాదు.. కాంట్రాక్టు పనుల్లోనూ కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కవుతున్నారు. కాంట్రాక్టర్లను బెదరగొట్టి.. అధికారులను అదరగొట్టి పర్శంటేజీలు పిండుకుంటున్నారు. ముక్కుపట్టి వసూలు చేసిన పర్శంటేజీలను పంచుకుతింటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఉరవకొండ తాగునీటి పథకం టెండరే.
ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల్లోని 112 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.56 కోట్లను మంజూరు చేసింది. పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి 112 గ్రామాలకు నీళ్లందించే ఈ పథకానికి రెండు నెలల క్రితం టెండర్ పిలిచారు. ఈ టెండర్‌పై ఆ నియోజకవర్గానికి చెందిన అధికార, విపక్ష ‘కీలక’ నేతల కళ్లు పడ్డాయి. ఇటీవల జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కైనట్లుగానే తాగునీటి పథకం టెండర్‌లోనూ అధికార, విపక్ష కీలక నేతలు కుమ్మక్కయ్యారు. టెండర్ విలువలో పది శాతం కమీషన్ ముట్టచెప్పిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కమీషన్ ముట్టచెప్పకపోతే పనులు జరగనివ్వమని తెగేసి చెప్పారు. అధికార, విపక్షాల కీలక నేతలు ఏకమవడంతో చేసేదిలేక కమీషన్ ముట్టచెప్పే కాంట్రాక్టర్‌ను మీరే వెతకాలని సూచించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన అధికార, విపక్ష నేతలు భూపాల్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు టెండర్ దక్కితే అంచనా విలువలో పది శాతం ముట్టచెప్పేలా ముందస్తుగా ఒప్పందం చేసుకున్నారు.
ఆ ఒప్పందం మేరకు భూపాల్ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి.. టెండర్ పిలవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు హుకుం జారీ చేశారు. ఆ మేరకు అధికారులు టెండర్ పిలిచారు. భూపాల్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ ఐదు శాతం అధిక ధరలకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సంస్థ ఐదు శాతం తక్కువ ధరలకు, నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సంస్థ 8.5 శాతం తక్కువ ధరలకు టెండర్లు కోట్ చేశాయి. భూపాల్ కన్‌స్ట్రక్షన్స్‌తో పోలిస్తే ఆ రెండు సంస్థలకు అనుభవం ఎక్కువ. భారీ కాంట్రాక్టు సంస్థలు కూడా.
కానీ.. అధికార, విపక్ష కీలక నేతలతో కుదిరిన ఒప్పందం మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అవేవీ పట్టించుకోలేదు. తక్కువ ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలపై అనర్హత వేటు వేసి.. ఐదు శాతం అధిక ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్‌ను నాలుగు రోజుల క్రితం ఖరారు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.2.80 కోట్ల భారం పడినట్లయింది. రూ.56 కోట్ల విలువైన పనిని దక్కేలా చేసిన ఉరవకొండ నియోజకవర్గ అధికార, విపక్ష కీలక నేతలకు సదరు కాంట్రాక్టు సంస్థ రూ.5.6 కోట్లను పర్శంటేజీల రూపంలో ఇప్పటికే ముట్టచెప్పినట్లు సమాచారం.
ఉరవకొండ తాగునీటి పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకర్‌రావును ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా.. ఆ టెండర్‌ను ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యవేక్షించారని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు తనకేమీ తెలియవని స్పష్టం చేశారు.
పర్సెంటేజీలకు టెండర్!
Published Fri, Sep 20 2013 2:52 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement