
పేరిరెడ్డి, హనిమిరెడ్డికి పదవులు
పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని ఇద్దరు నాయకులకు పార్టీ పదవులు కట్టబెడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పర్యవేక్షకునిగా ఆళ్ల పేరిరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పేరిరెడ్డి దాంతోపాటు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
పేరిరెడ్డి రామ్‌కీ గ్రూప్ అధినేతల్లో ఒకరు. ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విషయం విదితమే. వచ్చే నెల 5 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగనున్న ధర్నా కార్యక్రమం విజయవంతానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పేరిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ధర్నా ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షిస్తారు.
పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పర్యవేక్షకునిగా పానెం హనిమిరెడ్డి నియమితులయ్యారు. దీంతోపాటు ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీచేశారు. పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలను ఇక నుంచి హనిమిరెడి పర్యవేక్షించనున్నారు. మైనింగ్ ఇంజినీరింగ్ చేసిన ఆయన పార్టీలో రాష్ట్రసేవాదళ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.