
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో రూ.600 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం నిర్మాణానికి అనుమతి తెలిపింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి, రోగులు ఎక్కువగా ఉండడానికి అక్కడి ప్రజలు తాగే నీరు కారణమని పలువురు నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని బోర్ల ద్వారా సేకరించిన నీటినే మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు.
ఇకపై బయటి ప్రాంతం నుంచి నదీ జలాలను ఆ ప్రాంతానికి తరలించి ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని రేగులపాడు వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలోని పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 807 నివాసిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఉపయోగం కలగనుంది. ఈ సమగ్ర మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతి తెలుపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే మండలాలు 7
కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు,పలాస–కాశీబుగ్గ, మందస, సోంపేట, ఇచ్ఛాపురం
Comments
Please login to add a commentAdd a comment