ఇంటికెళ్లి తాగాల్సిందే..! | Permit Rooms Of Liquor Stores Will Cancelled In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఇంటికెళ్లి తాగాల్సిందే..!

Published Tue, Aug 6 2019 9:07 AM | Last Updated on Tue, Aug 6 2019 9:07 AM

Permit Rooms Of Liquor Stores Will Cancelled In Vizianagaram - Sakshi

సాక్షి, బొబ్బిలి (విజయనగరం): పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న మద్యం మహమ్మారిపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పటికే బెల్ట్‌దుకాణాలపై చర్యలు చేపట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌లు రద్దు వంటి కొత్త ఆలోచనలతో దశల వారీ మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నారు. కొత్త విధానంలో దుకాణం వద్ద మద్యంతాగేందుకు అవకాశం ఉండదు. ఇకపై మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా...
అనవసర ప్రచారాల ఖర్చుల కోసం ఇంటికో ఉద్యోగం హామీని వదిలేసి ఇంటింటికీ మద్యం సరఫరాలా చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆదాయమే పరమావధిగా కాకుండా పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమమమే లక్ష్యంగా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం రక్కసిని దశల వారీగా దూరం చేసేందుకు ఒక్కో ప్రణాళికా రచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను కొన్నాళ్లపాటు నడిపి దుకాణాల సంఖ్యను దశలవారీగా తగ్గించేందుకు గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు మరో ముందడుగు వేసి మద్యం దుకాణాల వద్ద ఇన్నాళ్లూ ఉన్న పర్మిట్‌ రూమ్‌ల విధానాన్ని రద్దు చేయనుంది. అక్టోబర్‌ 1 నుంచి అమలు కానున్న కొత్త మద్యం పాలసీలో ఈ విధానాన్ని తెరపైకి తేనున్నారు. దీంతో మద్యం తాగేందుకు షాపుకెళ్లి డబ్బులు కట్టి అక్కడే తాగేసి ఇంటికెళ్లే పరిస్థితులు మారనున్నాయి. మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లాల్సిందే! లేదా బారుకెళ్లి అదనంగా చెల్లించుకుని కిక్కు ఎక్కించుకోవాల్సిందే!

జిల్లాలో మద్యం దుకాణాలు: 210
మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్‌ రూమ్‌లు: 201
ఇటీవల మూతపడిన దుకాణాలు: 9
నడుస్తున్నవి: 201
బార్లు: 28
ప్రతీ నెలా మద్యం అమ్మకాలు: రూ.60 కోట్లు (సుమారు)

ప్రస్తుతం అన్ని షాపుల్లోనూ పర్మిట్‌ రూమ్‌లు..
జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలున్నాయి. మరో 28 బార్లున్నాయి. వీటి ద్వారా ప్రతీ నెలా సుమారు 60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రతీ రోజూ రూ.2 నుంచి 4 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత నెల 30తో పాత మద్యం పాలసీ విధానం ముగిసింది. కొత్త మద్యం పాలసీ విధానం వెంటనే అమల్లోకి రావాలి. కానీ ప్రభుత్వం మద్యం దశల వారీ నిషేధం హామీ వెనుక మూడు నెలల పాటు లైసెన్స్‌లను పొడిగించింది. ఈ లైసెన్సులను మూడు నెలల పాటు రెన్యువల్‌ చేసుకోవాలని ఇచ్చిన ప్రకటనలో జిల్లాలో 9 షాపులు ముందుకు రాలేదు. బెల్ట్‌షాపుల నిషేధం, పక్కా పాలసీ అమలు వంటి నిర్ణయాల కారణంగా ఆయా షాపుల యజమానులు ముందుకు రాలేదు. ఇప్పుడు కొత్తగా పర్మిట్‌రూమ్‌లను రద్దు చేయనుండటంతో మద్యం విక్రయాలు మరింత తగ్గే అవకాశముంది.

పర్మిట్‌ రూమ్‌లు ఉండవు! 
కొత్త మద్యం పాలసీపై మంగళవారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. అందులో కొత్త పాలసీలోని ప్రణాళికలు, ఇతర సూచనలూ చెబుతారు. అందరి ఎస్‌హెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి కొత్త విధానంపై సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తాం. కొత్త విధానంలో పర్మిట్‌ రూమ్‌లు ఉండవు. కావాల్సిన వారు మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే.
– వై.బి.భాస్కర రావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement