సాక్షి, విజయవాడ : పామర్రులోని అసిస్సీ జెడ్పీ పాఠశాలలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ జిల్లాస్థాయి కార్యక్రమం మంగళవారం జరిగింది. మంత్రి పేర్నినాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీ, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ వారి కళ్ళలో ఆనందాన్ని నింపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ రోజు విశిష్టమైందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక్క పంటకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం తరువాత సీఎం జగన్ పాలనలొనే డ్యామ్‌లు నిండు కుండల్లా మారాయని గుర్తు చేశారు. రెండో పంటకు సైతం నీరు ఇస్తామని తమ పార్టీ నాయకులు గర్వంగా చెప్పగలుగుతున్నారని బాలశౌరి వెల్లడించారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
పామర్రులో జిల్లా స్థాయి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పామర్రు నియోజకవర్గంలో 30,707 వేల కుటుంబాలకు రూ.41 కోట్లు మంజూరు చేశామని , ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చేరుతుందని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు లబ్ది పొందనున్నారని వెల్లడించారు. నవంబర్ 15 వరకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ సీడింగ్, వెబ్ లాండింగ్‌లో రైతుల పేర్లు సాధికారిక సర్వేలో నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని, గ్రామ సచివాలయ వలంటీర్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
అక్కడ నుంచి ఇక్కడొచ్చి పడ్డారు..
టీడీపీ నాయకులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. బరద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘పులివెందుల వరకు తరిమికొడతామని టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. టీడీపీ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమికొడితే ఇక్కడకొచ్చి పడ్డారు’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment