కిరణ్ విధేయులెక్కడ?
- పదవులు అంటిపెట్టుకుని కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామాలు
- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అమాస గుడ్‌బై
- డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతానని స్పష్టీకరణ
- పెదవి విప్పని వెంకటరమణ, జీవీ శ్రీనాథరెడ్డి, ఇంతియాజ్ అహ్మద్
సాక్షి, తిరుపతి: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డికి విధేయులెవరన్నది స్పష్టం కావడం లేదు. చాలామంది పదవీ కాంక్షతో ఊగిసలాట ధోరణి అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన పదవులు త్యజించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరికొందరు పదవిలో కొనసాగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
పార్టీ పదవులకు రాజీనామాలు ప్రకటిస్తున్న వారు అధికారిక పదవుల విషయానికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నా రు. కిరణ్‌కు సంఘీభావంగా గురువారం డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి సహా కొందరు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీ నామా చేయగా మరికొందరు చడీచప్పుడు లేకుండా జారుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి దయాదాక్షిణ్యాలతో పదవులు పొందిన వారు ఇప్పుడు పెదవి విప్పడం లేదు. ఒకరిద్దరు మినహాయిస్తే ఎమ్మెల్యే స్థాయి కలిగిన ప్రథమ శ్రేణి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు.
ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కాలంలో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థానాల ట్రస్ట్‌బోర్డు నియామకాలను కిరణ్ జరిపారు. వారెవరూ ఇప్పుడు పదవులు వదులుకునేందుకు సిద్ధం కావడం లేదు. వారం రోజుల కిందట తుడా చైర్మన్‌గాను ఆ తరువాత టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగాను నియమితులైన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ వంటివారు ఈ కోవలోకి వస్తారు. నిజానికి ఈయన తన పదవులకు కూడా రాజీనామా చేస్తారని బుధవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తెల్లారేసరికి ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు.
అధికారం ఉన్నన్నాళ్లు ఆయన వెంట ఉన్నవారు ఇప్పుడు కిరణ్ పేరు చెబితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టుదలతో సమాచార కమిషనర్‌గా నామినేట్ చేసిన ఇంతియాజ్ అహ్మద్, టీటీడీ ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా నియమితులైన జీవీ.శ్రీనాథరెడ్డి ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి తదితరులు కూడా ఎక్కడా కనిపించలేదు. కిరణ్ రాజీనామాపై వారి అభిప్రాయం కూడా వెల్లడించేందుకు ముందుకు రావడం లేదు.
ఏడాది వ్యవధిలో జరిగిన సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో గెలుపొందినవారు కూడా ఇప్పుడు పదవులు వదులుకునేందుకు నిరాకరిస్తున్నారు. తాము ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందినందున పదవులు వదులుకోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అమాస రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు.
కొందరు సన్నిహితుల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో కిరణ్‌కుమార్‌రెడ్డి బాటలోనే నడుస్తామని మాత్రం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డికి విధేయులెవరన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయనిపిస్తోంది.
పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో మొత్తం 62 మంది సర్పంచ్‌లు, సింగిల్‌విండో డెరైక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్నిబట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారని చెప్పకతప్పదు.