కలకలం | person died in police station | Sakshi
Sakshi News home page

కలకలం

Published Wed, Jul 2 2014 2:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

కలకలం - Sakshi

కలకలం

మడకశిర : మడకశిర పోలీస్ స్టేషన్ లాకప్‌లో షేక్ బషీర్ (36) అనే నిందితుడు  మృతి చెందడం కలకలం రేపింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. మడకశిరలో గత నెల 12వ తేదీన 20 టన్నుల ఐరన్ రాడ్లు చోరీ అయ్యాయని బాధితులు ఈ నెల 14న
 పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 ఈ మేరకు పోలీసులు సోమవారం రాత్రి మండలంలోని కల్లుమర్రికి చెందిన బషీర్‌ను నిందితునిగా భావిస్తూ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో అవమాన భారం భరించలేక లాకప్‌లోనే ఇనుప కడ్డీలకు సమైక్యాంధ్ర పార్టీ జెండాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. లాకప్‌లో ఇనుప కడ్డీలు ఎత్తులో లేవు. దాన్నిబట్టి అక్కడ ఉరి వేసుకునే ందుకు ఏమాత్రమూ అవకాశం లేదు.
 
 పోలీసులే ప్రాణం తీశారు!
 ‘కల్లుమర్రి సమీపంలోని పంజాబ్‌కు చెందిన వ్యక్తుల ఎస్టేట్‌లో బషీర్ చాలాకాలంగా కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఎస్టేట్‌లో ట్రాక్టర్ ట్రాలీ అపహరణకు గురైంది. ఇది బషీర్ చేశాడంటూ ఎస్టేట్ యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత శుక్రవారమే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ విచక్షణారహితంగా చావబాదారు. మా కుమారుడు అమాయకుడని, వదిలి పెట్టాలని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. పైగా డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి  మరోసారి పోలీసులు కొట్టిన దెబ్బలకు  బషీర్ ప్రాణాలు విడిచాడ’ని తల్లిదండ్రులు దష్కర్‌సాబ్, జానద్‌బీ ఆరోపించారు.
 
 సెంట్రీల నిర్లక్ష్యం
 పోలీస్‌స్టేషన్‌లో రాత్రి పూట ఇద్దరు సెంట్రీలు విధులు నిర్వర్తిస్తారు. సోమవారం రాత్రి ఒక సెంట్రీ, మరొక సపోర్ట్ సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. నిందితులు లాకప్‌లో ఉంటే నలుగురు సెంట్రీలను విధు ల్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పోలీసులు పాటించకుండా ఇద్దరినే ఉంచారు. సెంట్రీ డ్యూటీలో ఉన్న సిబ్బంది.. బషీర్ ఆత్మహత్యను ఎందుకు నివారించలేదు? వీరు విధుల్లో నిద్రపోవడం వల్లే నిందితుడు అఘాయిత్యం చేసుకున్నాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలకు చనిపోయాడా? అన్నది విచారణలో తేలాల్సి వుంది.
 
 కల్లుమర్రిలో విషాదం
 బషీర్ మృతితో కల్లుమర్రిలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసుల వల్లే తన భర్త మృతి చెందాడని, నలుగురు పిల్లలను తానెలా పోషించుకోవాలని బషీర్ భార్య రోదించింది. పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహంపై పడి భార్యా పిల్లలు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
 
 ప్రజా ప్రతినిధుల పంచాయితీ!
 మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పెనుకొండ డీఎస్పీ సుబ్బారావుతో సమావేశమై మృతుడి కుటుంబాన్ని ఆదుకునే విషయమై చర్చించారు. అనధికారికంగా అందిన సమాచారం మేరకు... ఈ సంఘటనకు కారకులైన ఎస్టేట్ యాజమాన్యం, ఇతరుల నుంచి నగదుతో పాటు మృతుడి భార్యకు పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగం, ప్రభుత్వం తరఫున రెండెకరాల భూమి ఇప్పించే విధంగా తీర్మానించినట్లు తెలిసింది.
 
 అమానుషం
 బషీర్ లాకప్‌డెత్ ఘటనను మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, స్థానిక నాయకులు రవిశేఖర్‌రెడ్డి, ఆనందరంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు,  కాంగ్రెస్ నాయకులు అశ్వర్థనారాయణ, మంజునాథ్, అక్రం, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం నాయకులు రామాంజినేయులు, మీరాన్‌సాబ్, ముస్తాక్, జుబేర్ తదితరులు  ఖండించారు. బషీర్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, 10 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు, లాకప్‌డెత్‌లతో చంద్రబాబు పాలన ప్రారంభమైందంటూ ఓపీడీఆర్ ఏపీ, టీఎస్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు విమర్శించారు. బషీర్ లాకప్‌డెత్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో బహిరంగ న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
 
 ఇది రెండో లాకప్‌డెత్
 బషీర్ (35) లాకప్‌డెత్  ఘటన మడకశిర నియోజకవర్గంలో రెండవది. 22 ఏళ్ల క్రితం అమరాపురం పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ జరగ్గా.. అందుకు బాధ్యుడైన ఎస్‌ఐకి జైలుశిక్ష పడింది. అలాగే 1994లో గుడిబండ మండలం మందలపల్లికి చెందిన హనుమంతరాయప్ప ఓ కేసుకు సంబంధించి మడకశిర సబ్‌జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం
 అనంతపురం కలెక్టరేట్: మడకశిరలో జరిగిన లాకప్‌డెత్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ లోకేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుకొండ ఆర్డీఓ ఎగ్గిడి వెంకటేశును విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. తక్షణ సహాయంగా మృతుడు బషీర్ భార్య హర్ఫతున్నీసాకు  రూ.20వేలు అందజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి కూడా నివేదిక పంపించినట్లు వివరించారు.
 
 ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు
 అనంతపురం క్రైం :  మడకశిర పోలీసు స్టేషన్‌లో మంగళవారం జరిగి న బషీర్ లాకప్‌డెత్ ఘటన లో ఎస్‌ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టెబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ మృతుని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్, అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్, పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు.
 
 విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు  శాంతించారు. అనంతరం ముగ్గురు కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగా బషీర్ మృతిచెందాడని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మృతికి కారణమైన ఎస్‌ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.  అనంతపురంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ లాకప్‌డెత్ ఘటనపైడీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించడమే కాకుండా, మెజిస్టీరియల్ విచారణ చేయిస్తున్నామన్నారు.
 
 మానవ హక్కుల ఉల్లంఘన
 
 నిందితుల్లో ప్రతి ఒక్కరూ నేరస్తులు కాదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా నేరస్తులను కనిపెట్టాల్సిన పోలీసులు తమకు చేతనైన లాఠీ ప్రయోగంతో మానవ హక్కులను కాలరాస్తున్నారు. విచారణ పేరుతో వారాల తరబడి అనధికారికంగా లాకప్‌లో ఉంచి చితకబాదుతున్నారు. థర్‌‌డ డిగ్రీ వంటి కఠిన చర్యలకు పాల్పడిన పోలీసు అధికారులు, సిబ్బందిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాల్సిన ఉన్నతాధికారులు సస్పెన్షన్లతో సరిపెడుతున్నారు. పోలీసులకు మిగిలిన శాఖలు కూడా తమ వంతు సహకారం అందించడంతో కస్టోడియల్ డెత్‌లు అనారోగ్య మరణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేసి ఖాకీల తీరును నిరసిస్తున్నా పోలీసుల్లో మార్పురావడం లేదు.
 
 ఇదీ లాకప్ డెత్‌ల జాబితా...
 1989లో కళ్యాణదుర్గం స్టేషన్‌లో ఒకరు, 1993లో ధర్మవరం స్టేషన్‌లో ఒకరు , 1995లో ముదిగుబ్బ స్టేషన్‌లో ఒకరు, 1997లో ఎరుకల జయమ్మ, ఎరుకల లక్ష్మి అనంతపురం పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురయ్యారు. 2001లో గాడ్లపెంట స్టేషన్‌లో ఒకరు, ధర్మవరం స్టేషన్‌లో ఒకరు, 2002లో విడపనకల్లు ఎక్సైజ్ స్టేషన్‌లో ఒకరు, అనంతపురం టూటౌన్ స్టేషన్‌లో ఒకరు, 2003లో కళ్యాణదుర్గం స్టేషన్‌లో ఒకరు, యాడికి స్టేషన్‌లో ఈశ్వరయ్య లాకప్‌డెత్‌కు గురయ్యారు. 2005, జనవరి 28న ఆకుతోటపల్లికి చెందిన తాడిపత్రి ఈశ్వరయ్య ఇటుకలపల్లి స్టేషన్‌లో, 2007లో నల్లచెరువు స్టేషన్‌లో ఒకరు, 2008లో హిందూపురం రూరల్ స్టేషన్‌లో ఒకరు, 2010లో ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌లో తమిళనాడుకు చెందిన మురుగేష్ అనే వ్యక్తి లాకప్‌డెత్‌కు గురయ్యారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మడకశిర పోలీసు స్టేషన్‌లో బషీర్ అనే నిందితుడు లాక్‌ప్‌డెత్‌కు గురైన తీరు పోలీసుల అమానుషానికి  అద్దం పడుతోంది.
 
 మహిళలపై లాఠిన్యం!
 ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలిని ఏమార్చి బంగారు, నగదును కాజేశారన్న ఆరోపణపై ఉరవకొండ పోలీసులు తాజాగా సోమవారం మధ్యాహ్నం సుమిత్ర, రాణి, మంజుల , దుర్గాలక్ష్మి అనే మహిళలను అదుపులోకి తీసుకుని విచక్షణారహితంగా లాఠీలతో కుళ్లబొడిచినట్లు సమాచారం. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి అనంతపురానికి తరలించార ని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement