డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
♦ ఆ ముగ్గురే కారణమంటూ సూసైడ్ నోట్
♦ ఎస్సీ కులసంఘ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ
♦ పోలీస్‌స్టేషన్ బాత్‌రూంలో విషద్రావణం తాగి..
లక్కిరెడ్డిపల్లె: పోలీస్‌స్టేషన్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన లక్కిరెడ్డిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. తన చావుకు ఆ ముగ్గురే కారణం అంటూ ఎస్‌ఐ, సీఐకి సూసైడ్ నోట్ రాశాడు. పాళెంగొల్లపల్లెకు చెందిన కోదండ జగన్నాథ అనే డిగ్రీ విద్యార్థి పోలీస్ స్టేషన్‌లోని బాత్‌రూంలో.. తన వెంట తెచ్చుకున్న విష ద్రావణం తాగాడు. పక్కనే ఉన్న మరొక విద్యార్థి గురయ్య కేకలు వేయడంతో వెంటనే మేల్కొన్న పోలీసులు జగన్‌ను బయటకు పంపించి వేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థి కథనం మేరకు.. రాయచోటి హరినాథరెడ్డి డిగ్రీ కళాశాలలో జగనాథ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.
తన గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సురేంద్ర తన గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో, చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. దీనిపై సురేంద్ర బంధువులైన ఎస్సీ కుల సంఘ నేతలు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు శ్రీను, ధనకుమార్, అంజనప్ప ఫోన్ చేసి.. ‘రూ.15 వేలు డబ్బులిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకుండా నిన్ను వదిలేస్తాం.. లేదంటే నీ జీవితం నాశనం చేస్తాం’ అంటూ బెదిరించినట్లు జగన్నాథం చెప్పాడు. దాంతో ఒత్తిడికి గురై తాను విష ద్రావణం తాగి చనిపోవడానికి సిద్ధమైనట్లు ఆయన వివరించాడు. తాను ఈ మధ్య ఆర్మీ కోచింగ్‌లో చేరానని, హాల్ టికెట్ కూడా వచ్చిందని తెలిపాడు.
ఇది మనస్సులో పెట్టుకొని వారు ముగ్గురు తనను చాలా భాధ పెడుతున్నారని, నా చావుకు వారే బాధ్యులని సూసైడ్ నోట్‌లో కూడా పేర్కొన్నట్లు తెలిపాడు. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉన్న అతని కుటుంబ సభ్యులు వెంటనే లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని రిమ్స్ వైద్యులు సూచించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేసు నమోదు కాలేదు: సీఐ
ఈ విషయమై ఎస్‌ఐ రాజాప్రభాకర్‌కు ‘సాక్షి’ ఫోన్ చేయగా పని చేయలేదు. తర్వాత ఏఎస్‌ఐ భాస్కర్‌ను వివరణ అడగగా.. ‘మీరేమన్న కేసు పెట్టారేమో.. మేము పెట్టలేదు’ అంటూ సమాధానం ఇచ్చారు. వెంటనే లక్కిరెడ్డిపల్లె సీఐ పుల్లయ్యను ఫోన్‌లో సంప్రదించగా... తమ స్టేషన్‌లో అయితే కేసు నమోదు కాలేదన్నారు. బయట మందు తాగాడని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.