పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలే | Pet candidates Anxiety in vijayawada | Sakshi
Sakshi News home page

పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలే

Published Fri, Sep 28 2018 3:47 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

Pet  candidates Anxiety in vijayawada - Sakshi

గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కి నినాదాలు చేస్తున్న పీఈటీ అభ్యర్థులు

సాక్షి, అమరావతి బ్యూరో: పీఈటీ పోస్టులు పెంచుతారా.. లేక చావమంటారా? వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేస్తారా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యర్థులు మండిపడ్డారు. పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకున్నామని, కానీ ప్రభుత్వం కేవలం 47 పోస్టుల భర్తీకి సిద్ధపడుతోందంటూ ఆందోళనకు దిగారు. ‘బాబూ..జాబు’ అంటూ నినదించారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాయామ విద్యా పోరాట సమితి అధ్వర్యంలో రాష్ట్ర వ్యాపంగా 13 జిల్లాల నుంచి సుమారు మూడు వేల మంది పీఈటీ అభ్యర్థులు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ర్యాలీగా ధర్నా చౌక్‌ వద్దకు చేరుకున్నారు. ‘బాబు... జాబు ’ అంటూ నినాదాలు, ఈలలతో హోరెత్తిం చారు. లబ్బీపేటలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ–2018లో 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని శాసన మండలి సాక్షిగా మానవవనరుల శాఖామంత్రి ప్రకటించారని తెలిపారు.

దీంతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు వదులుకుని రెండు సంవత్సరాలు వ్యయ ప్రయాసలకోర్చి కోచింగ్‌లు తీసుకున్నామని చెప్పారు. తీరా ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన సుమారు 20 వేల మంది పీఈటీ అభ్యర్థులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని అవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 47 పోస్టుల భర్తీకి మాత్రమే పూనుకుంటూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 1,056 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం
వేలాదిగా రాజధానికి తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువవంటి స్పందన రాకపోవడంతో కొంతమంది అభ్యర్థులు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం దగ్గర్లోని లబ్బీపేట వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం వెంటనే ముందు ప్రకటించిన విధంగా 1,056 పోస్టులతో డీఎస్సీ ప్రకటించాలని లేని పక్షంలో ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు చేసారు.

పోలీసులు ఒక్కొక్కరిని కిందకు దింపుతుండటం, కింద ఉన్న మహిళా అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఏలూరుకి చెందిన వి.నాగమణి కత్తితో కోసుకునే ప్రయత్నం చేసింది. ‘ప్రభుత్వం మా జీవితాలతో అడుకుంటోందని, మాకిక చావే శరణ్యం’ అంటూ ఆమె రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. చివరకు అభ్యర్థులందరినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు పటమట పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ అనంతరం విడుదల చేశారు. ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టిన నిరుద్యోగులకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఐ, బీజేవైఎం నేతలు కూడా ధర్నా చౌక్‌ వద్దకు చేరుకొని తమ మద్దతు ప్రకటించారు.

ఇవీ డిమాండ్లు
ఖాళీగా ఉన్న అన్ని పీఈటీ పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ విడుదల చేయాలి
 ఫిజికల్‌ లిటరసీ అమలు చేస్తూ ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి– ప్రతి – ప్రతి పాఠశాలలో ఒక ఎస్‌ఏ, ఒక పీఈటీని నియమించేలా తెచ్చిన జీఓ నం.29ని అమలు చేయాలి
  70 శాతం ప్రమోషన్లతో, 30 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేపట్టాలి.
  ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలి.

ఉన్న ఉద్యోగాలు పోయాయి..
ప్రభుత్వ ప్రకటనతో చేస్తున్న ఉద్యోగాలు వదిలి వేలాది రూపాయలు అప్పు చేసి కోచింగ్‌ తీసుకుంటున్నాం. మా జిల్లాలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయమంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఎన్నడూ లేనివిధంగా పీఈటీ పోస్టులకు టెట్‌ నిర్వహించిన ప్రభుత్వం ఇలా మోసం చేయడం బాధాకరం.  – ఐ.శైలజ, బీపీఈడీ, గుంటూరు.

వైఎస్సార్‌లా మెగా డీఎస్సీ ప్రకటించాలి..
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో మెగా డీఎస్సీ ప్రకటించి వేలాది మంది నిరుద్యోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. కానీ చంద్రబాబు మోసం చేశారు. 2012, 2014లో ప్రకటించిన డీఎస్సీల్లో కేవలం వందల్లోనే ఖాళీలు భర్తీ చేస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారు. వెంటనే వైఎస్సార్‌లాగా మెగా డీఎస్సీ ప్రకటించాలి. –శ్రీనివాస్, డోన్, కర్నూలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement