లేటరైట్ రైట్ | Peter Street, probably been going on | Sakshi
Sakshi News home page

లేటరైట్ రైట్

Published Fri, May 30 2014 12:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

లేటరైట్ రైట్ - Sakshi

లేటరైట్ రైట్

  •      గనులపై బడాబాబుల కన్ను
  •      జీకే వీధి, చింతపల్లిలో జోరుగా తవ్వకాలు
  •      మైదాన ప్రాంతాలకు భారీగా తరలింపు
  •      చోద్యం చూస్తున్న రెవెన్యూశాఖ
  •  పాడేరు,న్యూస్‌లైన్ : ఏజెన్సీలో నిక్షిప్తమైన లేటరైట్ ఖనిజాన్ని అక్రమార్కులు తవ్వుకుపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనప్పటికీ వీరు పెచ్చుమీరిపోతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, డుంబ్రిగుడ ప్రాంతాల్లో విలువైన లేటరైట్ ఖనిజ సంపద ఉంది.

    ఈ ఖనిజ సంపదను తవ్వుకుపోయేందుకు బడాబాబులంతా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆందోళనలతో రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పైగా లేటరైట్ తవ్వకాలపై నిషేధం విధించింది. ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఎలాంటి ఖనిజ సంపదను తవ్వినా కేసులు నమోదు చేస్తామని 2013లో అప్పటి ఆర్డీఓ ఎం.గణపతిరావు హెచ్చరించారు. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన వంటి పరిణామాలు బడా వ్యాపారులకు కలిసి వచ్చింది.

    రెండు నెలల నుంచి చింతపల్లి, జీకేవీధి మండలాల్లో లేటరైట్ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. సిమెంట్ కర్మాగారాలకు ముడిసరుకుగా ఉపయోగించే లేటరైట్ మట్టికి ఎంతో డిమాండ్ ఉంది. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు సిండికేట్‌గా చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలోనూ, జీకే వీధి మండలం చాపరాతిపాలెం వద్ద యంత్రాల సహాయంతో లేటరైట్ ఖనిజాన్ని భారీగా తవ్వుతున్నారు.

    ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఆనుకునే రాజుపాకల కాఫీ తోటల సమీపంలో ఇప్పటికే 200 లారీల లోడుల లేటరైట్ మట్టిని మైదాన ప్రాంతాలకు తరలించారు. డౌనూరు ప్రాంతంలో స్టాక్ పాయింట్‌ను దర్జాగా పెట్టేశారు. ఈ క్వారీలకు తాత్కాలిక రోడ్లను కూడా నిర్మించారు. ఇంత జరుగుతున్నా ఆయా మండలాల రెవెన్యూ యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో లేటరైట్ తవ్వకాలు జరుగుతుండటంతో డుంబ్రిగుడ మండలంపై కూడా బడాబాబులు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ కూడా తవ్వకాలకు వ్యూహం పన్నుతున్నారు. విలువైన ఖనిజ సంపదను దోచుకునే ముఠాలు మన్యంలో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అనుమతులు లేకపోయినా లేటరైట్ ఖనిజ సంపదను తవ్వుకుపోతున్న వైనం గిరిజనులను ఆందోళనకు గురిచేస్తోంది.
     
    చర్యలు తీసుకుంటాం
    చింతపల్లి, జీకేవీధి మండలాల్లో లేటరైట్ అక్రమ తవ్వకాలను ‘న్యూస్‌లైన్’ పాడేరు ఆర్డీఓ జి.రాజకుమారి దృష్టికి తీసుకు వెళ్లింది. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement