బంకులో పెట్రోల్ పోస్తున్న దృశ్యం, ఇంజిన్ మరమ్మతులతో మెకానిక్ షెడ్లకు చేరిన వాహనాలు
ఒక వైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారుడు అవస్థలకు గురవుతుంటే మరో వైపు బంక్ నిర్వాహకుల మోసాలకు బలై నష్టపోతున్నాడు. పెట్రోల్ కల్తీ చేయడం, రీడింగ్‌లో తక్కువ చూపడం వంటి మోసాలతో వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా కల్తీ జరుగుతోంది. దీనివల్ల రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలుచేసిన వాహనాలు పాడై మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. కీలకమైన ఇంజిన్ మరమ్మతులకు గురైన వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన కొద్దిరోజులుగా వీటి సంఖ్య మరీ పెరిగింది.
విశాఖపట్నం, చోడవరం: రూరల్‌జిల్లాలో పెట్రోల్,డీజిల్ బంకులు సుమారు 100కుపైగా ఉన్నాయి. ఒక్క చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. పెట్రోల్,డీజిల్‌లో ఇథనాయిల్, కిరోసిన్ కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతోపాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల పెట్రోల్,డీజిల్ ట్యాంకుల్లో రకరకాల ఇతర ఆయిల్స్‌ను కల్తీచేసి ఆ కల్తీ ఆయిల్‌నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల చోడవరం పరిసరాల్లో పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో బంకుల్లో ఆయిల్ కల్తీ మరీ ఘోరంగా జరుగుతోంది. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, జిల్లా రెవెన్యూ, కొలతలు,తూనికలు,పౌరసరఫరాల శాఖాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్‌బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాయిల్, కిరోసిన్‌తోపాటు పలు రకాల ఆయిల్స్‌ను పెట్రోల్,డీజిల్‌లో కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ కారణంగా చోడవరం పరిసరాల్లో పలువాహనాలు ఇంజిన్ స్ట్రక్ అయిపోయి మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. ప్రయాణం మధ్యలో వాహనాలు నిలిచిపోవడం వల్ల దూరప్రాంతాలకు, అత్యవసర పనులపై వెళ్లే వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
మా గ్రామం నుంచి చోడవరానికి పనిమీద వచ్చాను, ఇక్కడ బంకులో పెట్రోల్ కొట్టించాను. కొద్ది దూరం వెళ్లిన తరువాత మోటారుసైకిల్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించిన స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ షెడ్‌కు తెచ్చాను. ఆయిల్ కల్తీ వల్లే ఇంజిన్ పట్టేసిందని తెలిసింది. పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారించాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మా వాహనాలు పాడవుతున్నాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. – అప్పారావు, గాంధీ గ్రామం
కొత్త బైక్ పాడైంది
నేను కుటుంబసభ్యులతో కలిసి విశాఖపట్నం బయలు దేరాను. నా బైక్‌కు చోడవరం పట్టణంలో ఓ బంకులో రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించాను. కొద్దిదూరం వెళ్లిక ఆగిపోయింది. మండుటెండలో బండి ఆగిపోవడం వల్ల నేను, నా కుటుంబసభ్యులం చాలా ఇబ్బంది పడ్డాం. మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్తే ఇంజిన్ పట్టేసింది,ఆయిలే కారణమని అన్నారు. బంకుల్లో ఆయిల్ కల్తీలు జరగడం వల్ల నా కొత్త బైక్ మరమ్మతులకు గురైంది. ఈ కల్తీని అరికట్టకపోతే చాలా ఇబ్బంది. – శ్రీను, చోడవరం
Comments
Please login to add a commentAdd a comment