
పెట్రోల్ బంకుల మెరుపు సమ్మె!
దాడులకు నిరసనగా అంటున్న యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులకు నిరసనగా ఆదివారం నుంచి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు మెరుపుసమ్మెకు దిగాయి. ఆదివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ప్రకటించింది. తమ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ప్రభాకర్‌రెడ్డి, అన్వర్ పడేలా ఓ ప్రకటనలో తెలిపారు.
తూనికలు, కొలతల శాఖ అధికారుల వేధింపులు ఆపేవరకూ సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. పెట్రోల్ పంపు కొలతల్లో తప్పులు ఉన్నాయని.. అనుమతి లేని కంపెనీకి చెందిన యంత్రాలను వాడుతున్నారని తూనికలు, కొలతల శాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా ఆటోమేటిక్ మెషిన్లను వినియోగిస్తూ.. రిమోట్‌తో నియంత్రిస్తూ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని చెపుతున్నారు. ఈ మేరకు అనేక బంకులపై దాడులు చేసి కేసులు పెట్టారు. అయితే, బంకు యాజమాన్యాల వాదన మరోలా ఉంది.
తమ తప్పు లేకున్నా అధికారులు వేధిస్తున్నారంటున్నారు. పెట్రోల్ పంపుల మోడల్స్ తయారీ కంపెనీ ఎంపిక, దానిలోని సాంకేతిక అం శాలు తమ పరిధిలోనివి కావని.. ఇది కంపెనీల బాధ్యతన్నారు. ఇవే పంపులకు తూనికలు, కొల తల శాఖ తనిఖీ చేసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఆటోమేటిక్ యంత్రాలు విని యోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడతాయని యాజమాన్యాలు వాదిస్తున్నాయి.