
పెట్రో బాదుడు
ఒంగోలు టూటౌన్: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోలు లీటరుకు రూ.1.69 పెంచగా..పన్ను 50 పైసలు కలిపి రూ.2.19 పైసలు పెరిగింది. అదేవిధంగా డీజిల్ ధర 50 పైసలు, పన్ను 11 పైసలు కలిపి 61 పైసలు పెరిగింది. మొత్తం మీద ప్రస్తుతం పెట్రోలు లీటరు రూ.76.96, డీజిల్ ధర లీటరు రూ.61.77 అయింది. పెరిగిన ధరల వల్ల జిల్లా ప్రజలపై నెలకు రూ.3.69 కోట్లకుపైగా భారం పడుతోంది.
జిల్లాలో 165 పెట్రోలు బంకులున్నాయి. రెండు లక్షల వరకు ద్విచక్రవాహనాలు, 30 వేల వరకు కార్లు, జీపులు, ఇవి కాక ట్రాక్టర్లు, ఆటోలు కూడా ఉన్నాయి. రవాణా శాఖలో రోజుకు వంద కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రోజుకు లక్షా 98 వేల లీటర్ల పెట్రోలు..డీజిల్ 13 లక్షల లీటర్లు వినియోగిస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా జిల్లాపై డీజిల్ భారం రోజుకి రూ.7.93 లక్షలు పడగా..పెట్రోలు భారం రూ.4.38 లక్షలు. మొత్తం మీద రూ.12.31 లక్షల భారం రోజుకు వాహనదారులపై పడుతోంది. నెలకు రూ.3.69 కోట్ల వరకు భారం మోయాల్సిందే. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 సార్లకు పైగానే పెట్రోలు ధరలు పెంచి వాహనదారుల ఆగ్రహానికి గురైంది.
ప్రస్తుతం మోడీ సర్కార్ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి వాహనదారుల నడ్డి విరిచింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం ఇతర వస్తువుల పెరుగుదలపై పడుతుంది. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లుతున్నారు. మార్కెట్‌కు పోవాలంటే జంకుతున్నారు. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలు మరోసారి పెరిగి పేదలపై తీవ్రభారం పడనుంది.