శ్రీకాకుళం : పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ తొలగిన తర్వాత ధరల పెరుగుదలపై నియంత్రణ లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చము రు ధరలకు అనుగుణంగా ఆయిల్ సంస్థలే రోజువారీ ధరలను సవరిస్తున్నాయి. అయితే గత రెండు నెలల్లో పెట్రోల్ ధరలు పెరగడం తప్ప తగ్గింది లేదు. ఈ ఏడాది జనవరి నెలలోనే 18 రోజుల వ్యవధిలో పెట్రోలుపై రూ. 1.51 పెరగ్గా, డీజిల్‌పై రూ. 2.55 పెరిగింది. ఫిబ్రవరిలో పది రోజులే గడవగా ఇదే రీతిన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల మార్పు కారణంగా ఒకేసారి పెంపు లేకపోయినప్పటికీ మెల్లమెల్లగా వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. నెల వ్యవధిలో పెట్రోల్ ధర 24 సార్లు పెరిగితే రెండుమూడు సార్లు మాత్రమే తగ్గింది.
జనవరి 1 నుంచి మాత్రం పెట్రోలు, డీజి ల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గింది. జనవరి 1న పెట్రోల్ ధర రూ. 75.87 ఉండగా ప్రస్తుతం రూ. 79.14కు చేరింది. డీజిల్ సైతం అదే దారిలో జనవరి 1న రూ. 66.76 ఉంటే ప్రస్తుతం రూ.71.11కు చేరింది. చమురు సంస్థలు రాత్రి 12 గంటలకు ఆ రోజు అమలు చేసే ధరను ఎస్‌ఎంఎస్ రూపంలో పంపుతారు. దీనిని చూసుకొని ఉదయం 5 గంటల నుంచి కొత్త ధరను అమలుచేస్తూ బంకు యాజమాన్యాలు విక్రయాలు జరుపుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ధర పెరుగుదలను పరిశీలిస్తే వారంలోపే లీటరు పెట్రోల్ ధర రూ. 85 వరకు, డీజిల్ ధర రూ.80 వరకు చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పన్నుల మోత
కొత్త విధానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటే పొరుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నాయి. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ. 6.50, తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 , ఒడిశాలో రూ.2 వరకు తక్కువగా ఉంటున్నాయి. కేంద్రంతోపాటు రాష్ట్రం విధించే పన్నులకు తోడు ఏపీ ప్రభుత్వం అదనంగా వ్యాట్ రూపంలో 28 శాతం వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఇక్కడే పెట్రో ధరలు మండిపోతున్నాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెంచిన ఎక్సైజ్ సంకాన్ని కొంతమేర తగ్గించింది. లీటరుకు రూ.2 తగ్గించడంతో పాటు రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా ఏపీలో మాత్రం తగ్గించలేదు. అంతేకాకుండా లీటరుకు అదనంగా రూ. 4 వ్యాట్ వసూలు చేస్తుండటం గమనార్హం. ఇలా ధరలు పెరుగుదలతో జిల్లా పెట్రో వినియోగదారులపై నెలకు దాదాపు కోటి రూపాయిలకు పైగా భారం పడుతోందని అంచనా.
మన రాష్ట్రంలోనే ఎక్కువ
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎంత రేటు పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనిపై బీజేపీ, టీడీపీ నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
– గుండబాల మోహన్, కాంట్రాక్టు ఉద్యోగి
అంతా గందరగోళం
పెట్రోల్ ధరలను రోజుకో విధంగా నిర్ణయిస్తుండటంతో గందరగోళ ప రిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎంత ధర ఉంటుందో తెలియడం లేదు. ఇది సరైన విధానం కాదు. గతంలో మాదిరిగా ఒకే ధరను అమలు చేయాలి.
– యండ ఉమాశంకర్, ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment