నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోలు బంకులు బంద్
- 24 గంటలపాటు బంకుల మూత
- పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్ భారం తగ్గించాలని డీలర్ల డిమాండ్
విజయవాడ: పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విధించిన నాలుగు శాతం వ్యాట్ భారాన్ని తగ్గించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతూ పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చినా ఫలితం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వివరించింది.
టీడీపీ ప్రభుత్వం ఆరునెలలక్రితం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటంతో లారీల యజమానులు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆరునెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో 40 శాతం మేరకు డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి.. ఆ మేరకు పొరుగు రాష్ట్రాల్లో పెరిగాయని వివరించారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నరసింహారావు హెచ్చరించారు.