కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఏఐఏంటీసీ బృందం
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు.
దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.
కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్‌సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సర్వత్రా నో స్టాక్...!
రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్‌తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు.
అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు.
Comments
Please login to add a commentAdd a comment