Petrol Stations Bandh
-
పెట్రోల్ బంక్‌ల ముందు భారీ క్యూలైన్లు.. రెండో రోజు కొనసాగుతున్న రద్దీ
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు కూడా ప్రెటోల్ బంక్‌ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒకసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వాహనాలను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి -
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్‌తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
అడ్రస్ లేని ఆర్టీసీ బంకులు.. ఒకటితోనే సరి !
భద్రాద్రి : తీవ్ర నష్టాల బారి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రగతిబాట పట్టించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లు, వాటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో హిందుస్థానన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్రంలోని 46 చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, చండ్రుగొండ, మణుగూరు, వెంకటాపురంలో బంకుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుతో దాని ద్వారా వచ్చే లీజు ఆదాయ వనరులతో పాటు ఇంధన సంస్థలు కొంతమేర కమీషన్‌ను ఆర్టీసీకి చెల్లిస్తాయి. ఈ ప్రక్రియలో మొదట జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పెట్రోల్ బంక్‌కు ప్రాధాన్యత కల్పించారు. కొత్తగూడెంలో బంక్ అందుబాటులోకి తేవడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మిగతా ఆరు చోట్ల కూడా స్థలాలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. అయితే ఇందులో మణుగూరు, బూర్గంపాడు ఇంధన వ్యాపారానికి అనుకూలంగా లేవని గుర్తించిన ఉన్నతాధికారులు.. కొత్తగా దమ్మపేటలో బంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా బంకుల ఏర్పాటులో ఎలాంటి పరోగతి కనిపించడం లేదు. స్థలాలను సద్వినియోగం చేసేలా.. రోజువారీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోతో పాటు ఆదాయం పెంచుకుంటున్న ఆర్టీసీ.. మరింతగా ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలో ప్రధాన రహదారుల పక్కనే ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. డిపోల పక్కన ఏర్పాటు చేయబోయే బంకులను సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. సొంతంగా పెట్రోల్ బంకుల నిర్వహణ చేపడితే స్థలాలకు ఆయా చమురు సంస్థల నుంచి లీజుతో పాటు లీటర్ పెట్రోల్‌పై రూ.2.83, డీజిల్‌కు రూ.1.89 పైసల చొప్పున కంపెనీలు ఇచ్చే కమీషన్ కూడా ఆర్టీసీకే సమకూరుతుంది. జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయి. కొత్తగూడెం పాతబస్ డిపో ఏరియాలో 2.50 ఎకరాలు, పాల్వంచలో 1.50 ఎకరాలు, చండ్రుగొండలో సుమారు ఎకరం, భద్రాచలంలో 6 ఎకరాలు, ఇల్లెందులో 6 ఎకరాలు, బూర్గంపాడులో 2.50 ఎకరాలు, మణుగూరులో 8 ఎకరాలు, అశ్వాపురంలో 2 ఎకరాల చొప్పున ఆర్టీసీకి స్థలాలున్నాయి. వీటితో పాటు చర్ల, వెంకటాపురంలో కూడా అనువైన స్థలాలే ఉన్నాయి. వీటి పరిధిలో బంకు ఏర్పాటుకు అవసరమైన 1000 గజాల స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒక్క కొత్తగూడెంలో మాత్రమే ప్రారంభించారు. మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు చేస్తే సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియ నడుస్తోంది ఆర్టీసీ స్థలాల్లో సంస్థ ఇప్పటికే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల లీజు, కమీషన్ పద్ధతుల్లో సంస్థకు కొంత ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో మొదట ఏడు చోట్ల ఆర్టీసీ బంకుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాం. తొలి ప్రాధాన్యతగా కొత్తగూడెం డిపో పరిధిలో ఇటీవలే పెట్రోల్ బంకును ప్రారంభించాం. మిగిలిన చోట్ల అనుకూలమైన వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్రాసెన్ నడుస్తోంది. – భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం(మెయింటెనెన్స్) -
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోలు బంకులు బంద్
- 24 గంటలపాటు బంకుల మూత - పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్ భారం తగ్గించాలని డీలర్ల డిమాండ్ విజయవాడ: పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విధించిన నాలుగు శాతం వ్యాట్ భారాన్ని తగ్గించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతూ పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చినా ఫలితం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వివరించింది. టీడీపీ ప్రభుత్వం ఆరునెలలక్రితం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటంతో లారీల యజమానులు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆరునెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో 40 శాతం మేరకు డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి.. ఆ మేరకు పొరుగు రాష్ట్రాల్లో పెరిగాయని వివరించారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నరసింహారావు హెచ్చరించారు.