కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ పెంట్రోల్ బంకు
భద్రాద్రి : తీవ్ర నష్టాల బారి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రగతిబాట పట్టించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లు, వాటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో హిందుస్థానన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్రంలోని 46 చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, చండ్రుగొండ, మణుగూరు, వెంకటాపురంలో బంకుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుతో దాని ద్వారా వచ్చే లీజు ఆదాయ వనరులతో పాటు ఇంధన సంస్థలు కొంతమేర కమీషన్‌ను ఆర్టీసీకి చెల్లిస్తాయి. ఈ ప్రక్రియలో మొదట జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పెట్రోల్ బంక్‌కు ప్రాధాన్యత కల్పించారు. కొత్తగూడెంలో బంక్ అందుబాటులోకి తేవడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మిగతా ఆరు చోట్ల కూడా స్థలాలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు.
అయితే ఇందులో మణుగూరు, బూర్గంపాడు ఇంధన వ్యాపారానికి అనుకూలంగా లేవని గుర్తించిన ఉన్నతాధికారులు.. కొత్తగా దమ్మపేటలో బంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా బంకుల ఏర్పాటులో ఎలాంటి పరోగతి కనిపించడం లేదు.
స్థలాలను సద్వినియోగం చేసేలా..
రోజువారీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోతో పాటు ఆదాయం పెంచుకుంటున్న ఆర్టీసీ.. మరింతగా ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలో ప్రధాన రహదారుల పక్కనే ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. డిపోల పక్కన ఏర్పాటు చేయబోయే బంకులను సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. సొంతంగా పెట్రోల్ బంకుల నిర్వహణ చేపడితే స్థలాలకు ఆయా చమురు సంస్థల నుంచి లీజుతో పాటు లీటర్ పెట్రోల్‌పై రూ.2.83, డీజిల్‌కు రూ.1.89 పైసల చొప్పున కంపెనీలు ఇచ్చే కమీషన్ కూడా ఆర్టీసీకే సమకూరుతుంది.
జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయి. కొత్తగూడెం పాతబస్ డిపో ఏరియాలో 2.50 ఎకరాలు, పాల్వంచలో 1.50 ఎకరాలు, చండ్రుగొండలో సుమారు ఎకరం, భద్రాచలంలో 6 ఎకరాలు, ఇల్లెందులో 6 ఎకరాలు, బూర్గంపాడులో 2.50 ఎకరాలు, మణుగూరులో 8 ఎకరాలు, అశ్వాపురంలో 2 ఎకరాల చొప్పున ఆర్టీసీకి స్థలాలున్నాయి. వీటితో పాటు చర్ల, వెంకటాపురంలో కూడా అనువైన స్థలాలే ఉన్నాయి. వీటి పరిధిలో బంకు ఏర్పాటుకు అవసరమైన 1000 గజాల స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒక్క కొత్తగూడెంలో మాత్రమే ప్రారంభించారు. మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు చేస్తే సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి.
ప్రక్రియ నడుస్తోంది
ఆర్టీసీ స్థలాల్లో సంస్థ ఇప్పటికే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల లీజు, కమీషన్ పద్ధతుల్లో సంస్థకు కొంత ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో మొదట ఏడు చోట్ల ఆర్టీసీ బంకుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాం. తొలి ప్రాధాన్యతగా కొత్తగూడెం డిపో పరిధిలో ఇటీవలే పెట్రోల్ బంకును ప్రారంభించాం. మిగిలిన చోట్ల అనుకూలమైన వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్రాసెన్ నడుస్తోంది.
– భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం(మెయింటెనెన్స్)
Comments
Please login to add a commentAdd a comment