వన సంరక్షణే ధ్యాసగా..
అవార్డులతో
రాములు
● అటవీప్రాంత పరిరక్షణకు పాటుపడుతున్న అన్నపురెడ్డిపల్లివాసి
● పలు అవార్డులు పొందిన చెదురుపల్లి రాములు
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): ఓ సామాన్యుడు వన సంరక్షణకు పాటుపడుతున్నాడు. ప్రకృతి సంపద పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాడు. దాదాపు ఏడు వందల హెక్టార్లలో ఉన్న వనసంరక్షణ సమితి(వీఎస్‌ఎస్) అడవిలో ఒక్క ఎకరంలో కూడా పోడు నరకకుండా అడ్డకున్నాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వీఎస్‌ఎస్ చైర్మన్ చెదురుపల్లి రాములు గౌడ్ అటవీ ప్రాంత సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు సైతం ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడుతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ అధికారులు అన్నపురెడ్డిపల్లి వచ్చి అటవీ సంరక్షణకు ఇతని నుంచి సలహాలు తీసుకున్నారు. వీఎస్‌ఎస్ చైర్మన్ అయిన రాములు రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకనే తిరుగుతూ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తాడు. అటవీశాఖలో సామాన్య ఉద్యోగి నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారి వరకు రాములును అన్నా అని సంబోధిస్తారు. 2002 నుంచి 2006 వరకు పలు అవార్డలు పొందిన రాములు ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ వన సంరక్షణకు కృషి చేస్తున్నాడు.
ఎక్కువ సమయం అడవిలోనే..
చిన్ననాటి నుంచే నాకు అడవి అంటే ఇష్టం. 1996లో వనసంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 700 హెక్టార్లల అడవిని కాపాడుతున్నాను. మూడు దశాబ్దాల్లో ఎక్కువకాలం అడవిలోనే గడిపాను. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 300 వనసంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుం మా కమిటీ ఒక్కటే పనిచేస్తోంది. – రాములు, వీఎస్‌ఎస్ చైర్మన్, అన్నపురెడ్డిపల్లి
వన సంరక్షణే ధ్యాసగా..
Comments
Please login to add a commentAdd a comment