తొమ్మిది నిమిషాలు లేట్..
ఇంటర్మీడియట్ పరీక్షకు అనుమతించని అధికారులు
పాల్వంచరూరల్: నిర్దేశించిన సమయం కంటే తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సోమవారం అధికారులు పరీక్షకు అనుమతించలేదు. వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో రోదిస్తూ వెనుదిరిగింది. మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు చర్లకు చెందిన జి.సుభాషిణి సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు చేరుకుంది. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తులసిని అర్ధగంటసేపు వేడుకున్నా కనికరించలేదు. సమయం మించిపోయిందని లోపలకు రానివ్వకుండా గేటు వద్దే నిలిపివేశారు. విషయం జిల్లా నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లినా అనుమతి ఇవ్వలేమని తెలిపారు. దీంతో విద్యార్థిని కన్నీరు పెట్టుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది. కాగా సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు పాల్వంచలోని నాలుగు కేంద్రాల్లో 969 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 24మంది గైర్హాజరయ్యారు. 945 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment