టాపర్ ఆకుల శ్రీకాంత్
ఫలితాలను ప్రకటించిన హెల్త్ వర్సిటీ
విజయవాడ, న్యూస్‌లైన్: పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈనెల 2న నిర్వహించిన 2014-15 ఏపీ పీజీ మెడికల్ ప్రవేశపరీక్ష (ఏపీపీజీఎంఈటీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశపరీక్షకు 14,641 మంది దరఖాస్తు చేసుకోగా 14,183 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 8,105 మంది అర్హత సాధిం చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయనగరం మహారాజా వైద్య కళాశాల విద్యార్థి ఆకుల శ్రీకాంత్ (180/200 మార్కులు) టాపర్‌గా నిలిచారు. నాన్‌లోకల్ అభ్యర్థిని సాయిసుధ చిన్నమ్మ (178), ఉస్మానియా వర్సిటీ పరిధి ఖమ్మంలోని మమతా వైద్య కళాశాలకు చెందిన బీరెల్లి శ్రీనివాస్ (173) వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. నాలుగో ర్యాంకును శ్రీవెంకటేశ్వర వర్సిటీ పరిధిలోని కర్నూలు వైద్య కళాశాల విద్యార్థి సందీప్ ఓగు (171), ఐదో ర్యాంకును నాన్‌లోకల్ అభ్యర్థిని సీతాలావణ్య పోలూరి (171) కైవశం చేసుకున్నారు. గత ఏడాది 63 శాతం ఉత్తీర్ణత ఉండగా, ఈ ఏడాది 57.15 శాతం మంది అర్హత సాధించారు. తొలి విడత కౌన్సెలింగ్ ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ప్రారంభమవుతుందని వీసీ డాక్టర్ రవిరాజు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ పాల్గొన్నారు.
పీజీ మెడికల్ ప్రవేశపరీక్ష
Published Sun, Mar 16 2014 2:00 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement