
విలేకరులతో మాట్లాడుతున్న బేబీ లక్ష్మి
పీజీ వైద్య విద్యార్థిని లక్ష్మి ఆవేదన
గుంటూరు: ప్రేమించి, పెళ్లి చేసుకుని... పద్నాలుగు నెలలు తిరగకుండానే వద్దు పొమ్మంటున్నాడు. రూ.20 లక్షలు ఇస్తా.. విడాకులిమ్మంటూ.. ఏడడుగుల బంధానికి రేటు కడుతున్నాడు. తప్పని చెప్పాల్సిన అతని తల్లితండ్రులు.. వత్తాసు పలుకుతున్నారు. ఈ బాధలు తట్టుకోలేని ఇల్లాలు బేబీ లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం గుంటూరులో మీడియా ముందు తన బాధను కన్నీరుమున్నీరుగా వెళ్లబోసుకుంది...
గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన కంఠమనేని భవానీశంకర్, వాణిల కుమార్తె లక్ష్మి 2015లో అమలాపురం కిమ్స్ కళాశాలలో ఎంఎస్ (జనరల్ సర్జరీ)లో చేరారు. అదే కళాశాలలో పీజీ చేస్తున్న కొత్తపల్లి సాయికృష్ణ లక్ష్మిని ప్రేమించి, ఇరువురి పెద్దల అనుమతితో అదే ఏడాదిలో పెళ్లి చేసుకున్నాడు. సాయికృష్ణ తండ్రి కొత్తపల్లి రాజసూర్యసాంబశివరావు నాగార్జున వర్సీటీలో రెక్టార్. తల్లి కృష్ణశ్రీ పొగాకు బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్. సాయికి పది ఎకరాల పొలం, వంద సవర్ల బంగారం, కారు కట్నంగా ఇచ్చారు. సాయికృష్ణ, లక్ష్మి అమలాపురంలో కాపురం పెట్టారు. నెల రోజులు సక్రమంగా సాగిన సంసారంలో సమస్యలొచ్చాయి. సాయి అదనపు కట్నం కావాలని లక్ష్మిని వేధింపులకు గురిచేయటం ప్రారభించాడు.
నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఓ ఎమ్మెల్యే కుమార్తె భారీగా కట్నం ఇచ్చేదంటూ.. ఇబ్బందులు పెట్టాడు. అత్తామామలకు చెప్పినా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. వేధింపులు తట్టుకోలేక.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఆమె తల్లితండ్రులు ఈ నెల 20న అమలాపురం వెళ్లి సాయికృష్ణతో మాట్లాడినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో 21న అమలాపురంలో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితుల సాయంతో బతికి బైటపడింది. చావుబతుకుల మధ్య నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే పలకరించేం దుకు భర్త, అత్తామామలెవరూ రాలేదు. దీంతో అక్కడ కేసు నమోదు అయింది. సాంబశివరావు తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. రూ 20 లక్షలు ఇస్తాను.. విడాకులు ఇమ్మంటూ.. భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు. తనకు న్యాయం చేయాలని లక్ష్మి వేడుకొంటున్నారు.
వేధిస్తున్నారు: బేబీ లక్ష్మి తల్లితండ్రులు
సాయికృష్ణ తమ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నాడని లక్ష్మి తల్లితండ్రులు భవానీ శంకర్, వాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం అంటగట్టి, ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటు న్నారని విలపించారు. అతని తల్లిదండ్రులూ పట్టించుకో లేదన్నారు. కేసులు పెట్టినా రాజకీయ బలం ఉన్న వారిని ఏమీ చేయలేమన్నారు. అందుకే మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు వివరించారు.
ఒక్క రూపాయి తీసుకోలేదు: సాంబశివరావు
తన కుమారుడి వివాహానికి ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ సాంబశివరావు తెలిపారు. ఆయన కోడలు బేబీ లక్ష్మి చేసిన ఆరోపణలపై వివరణ కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు. వివాహం అయిన రెండు, మూడు నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయన్నారు.