విచారణాధికారి నివేదిక నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఆదేశం
రంగంలోకి నేర పరిశోధన విభాగం
హైదరాబాద్/విజయవాడ: పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై గవర్నర్ నరసింహన్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పీజీ వైద్య పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం విచారణాధికారిగా నియమితులైన ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి సోమవారం తన నివేదికను గవర్నర్‌కు సమర్పించారు.
ఈ నేపథ్యంలో వెంటనే సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన నరసింహన్ వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో కొన్ని అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణ అనంతరం వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు ధ్రువీకరించారు. ఈ పరీక్షలో 12వ ర్యాంకు సాధించిన అభ్యర్థి విషయమై ఆరా తీశారు. ఇతను చండీగఢ్ పీజీ మెడికల్ ప్రవేశపరీక్ష (2012) అవకతవకల కేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతనికి వచ్చిన మార్కు లు, తల్లిదండ్రుల నివాసస్థలం, వృత్తి తదితర అంశాలపై పోలీసుల సాయంతో విచారణ జరిపారు. అలాగే 16వ ర్యాంకర్ విషయంలోనూ ఆరా తీశారు.
విజయవాడకు రెండు సీఐడీ బృందాలు
గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఐపీసీలోని ఓ సెక్షన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్‌లోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో, కోణాల్లో ఆరా తీసేందుకు తక్షణం ఆరు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన అధికారులతో పాటు వర్శిటీ అధికారులు సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్‌తో సమావేశమై ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాల్ని వివరించారు.
దీంతో తక్షణం రెండు బృందాలను విజయవాడకు పంపారు. మరో నాలుగు బృందాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేయనున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఎవరి పేర్లూ చేర్చలేదు. అయితే సోమవారం సాయంత్రం ఓ డీఎస్పీ స్థారుు అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాలు విజయవాడ చేరుకున్నారుు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్‌ను సుదీర్ఘంగా విచారించారు. కాగా, సీబీసీఐడీ విచారణకు ఆదే శించిన నేపథ్యంలో పోలీసులు కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న ఏప్రిల్ 15లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తారా? కౌన్సెలింగ్‌ను వాయిదా పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
కౌన్సెలింగ్‌కు అంగీకరించం: జూనియర్ వైద్యులు
విచారణ పూర్తిచేసిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించాలని లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలని జూనియర్ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షుడు అభిలాష్ కోరారు.
కౌన్సెలింగ్ ముగింపు గడువు జూలై 7
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు గడువును భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) జూలై 7వ తేదీ వరకు పొడిగించినట్లు వీసీ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.
పీజీ వైద్య పరీక్షపై ‘సీఐడీ’
Published Tue, Mar 25 2014 4:11 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement