సాక్షి, విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈ సందర్భంగా నరసింహన్, విమలా నరసింహన్‌ను సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.
వైఎస్ జగన్ పాలనలో మరిన్ని సెంచరీలు చేయాలి
ఈ సందర్భంగా నరసింహన్...ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నప్పుడు విజయవాడలోనే అక్షరాభాస్యం జరిగిందని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నరసింహన్ మాట్లాడుతూ.. ‘ఏపీకి గవర్నర్‌గా వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. గడిచిన పదేళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది. ఈ 34 రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ప్రతి బాల్ సిక్సర్, బౌండరీలు తాకుతున్నట్లు ఉంది. పాలనలో వైఎస్ జగన్ మరిన్ని సెంచరీలు చేయాలని కోరుకుంటున్నా. వైఎస్ జగన్‌కు ఆయన సతీమణి భారతి ఒక బలం. అసెంబ్లీలో వైఎస్ జగన్ వ్యవహారశైలి నియమావళికి అనుగుణంగా కొనసాగుతోంది. గవర్నర్‌గాఈ నరసింహం వెళ్లిపోతున్నా...అహోబిలం, సింహాచలం, మంగళగిరి నరసింహులు మీతోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అవినీతిరహిత రాష్ట్రం కోసం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలి. నాకు సహకరించిన మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, అజేయ కల్లాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పలువురు మంత్రులు, వైఎస్సార్ సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆత్మీయ విందు అనంతరం నరసింహన్ దంపతులు తిరిగి హైదరాబాద్ వెళనున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో నరసింహన్
అంతకు ముందు నరసింహన్ గవర్నర్ హోదాలో చివరిసారిగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు అశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ ఈవో...గవర్నర్ దంపతులకు అందచేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment