నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్
ఫైలిన్ తుపానుతో పత్తి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షానికి పత్తి కాయలు పగిలిపోయి రాలిపోతుండడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 3లక్షల 12వేల 647 హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పత్తిచేలకు లాభం చేకూరింది. పత్తి పూత, కాత బాగా ఉండడంతో రైతులు దిగుబడిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. పత్తి దిగుబడి సుమారు 46లక్షల 80 వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ కూడా అంచనాలు వేసింది. కానీ, ప్రస్తుతం కురుస్తున్న తుపాను పత్తి రైతులఆశలపై నీళ్లు చల్లింది.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పత్తి మొదటి దశ విరుపుడు పూర్తయి రెండవ దశ విరుపుడు చేస్తున్నారు. రెండు, మూడో దశ విరుపుడు సమయంలోనే పత్తి కాయ పెద్ద ఎత్తున పగులు తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చేనుపై ఉన్న పత్తి తడిసి నేలరాలిపోతుంది. మరో రెండు, మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో పత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదేవిధంగా వర్షం కురిస్తే పత్తి మొత్తం నేలపాలయ్యే ప్రమాదం ఉంది. చేనుపై మిగిలిన పత్తి కూడా గింజలు మొలకెత్తి రంగు మారనుంది. రంగుమారిన పత్తికి ధర కూడా తక్కువగానే చెల్లిస్తారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కోటి ఆశలతో పత్తి సాగు చేసిన అన్నదాతను ఫైలిన్ తుపాను ముంచే అవకాశం లేకపోలేదు.
27.3 మి.మీ వర్షపాతం నమోదు
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపాను కారణంగా బుధవారం నుంచి గురువారం వరకు విస్తారంగా వర్షం కురుస్తుంది. జిల్లాలో సగటున 27.3 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు చెపుతున్నారు. నూతన్‌కల్ మండలం మినహా మిగతా 58 మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 60 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చండూరు మండలంలో 4.2 మిల్లీమీటర్ల కురిసింది. అర్వపల్లి మండలంలో 59.8, మోత్కూరులో 55.2, కేతెపల్లిలో 54.8, మర్రిగూడలో 53.8, వలిగొండలో 53.2, గుండాలలో 50, బొమ్మలరామారంలో 19, తుర్కపల్లిలో 10.2, రాజాపేటలో 35.4 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. యాదగిరిగుట్టలో 42, ఆలేరులో 35.6, ఆత్మకూరు(ఎం)లో 28.2, భువనగిరిలో 13.2, బీబీనగర్‌లో 10.6, పోచంపల్లిలో 42.2, చౌటుప్పల్‌లో 26.2, రామన్నపేటలో 43.4 మిల్లీమీటర్లు కురిసింది.
అదేవిధంగా శాలిగౌరారంలో 40.2, చిట్యాలలో 35, నార్కట్‌పల్లిలో 48.6, కట్టంగూరులో 26.4, నకిరేకల్‌లో 38.2, తిప్పర్తి, వేములపల్లిలలో 11.4, నల్లగొండలో 36.2, మునుగోడులో 17.2, నారాయణపురం, కనగల్ మండలాల్లో 7, గుర్రంపోడ్‌లో 11.8, నాంపల్లిలో 45.4, చింతపల్లిలో 33.6, పీఏపల్లిలో 10.8, దేవరకొండలో 5.4, డిండిలో 31.2 మిల్లీమీటర్ల కురిసింది. చందంపేటలో 8.8, నిడమనూరులో 14.8, త్రిపురారంలో 33.6, మిర్యాలగూడలో 5, గరిడెపల్లి 9.4, హుజూర్‌నగర్ 27.4, మఠంపల్లి 14.4, నేరెడుచర్ల 10.2, దామరచర్ల 54, అనుముల 38.4 మిల్లీమీటర్లు కురిసింది. పెద్దవూరలో 10.4, తుంగతుర్తిలో 13.4, సూర్యాపేటలో 21.4, చివ్వెంలలో 38.2, మోతెలో 18.6, మునగాలలో 45.4, నడిగూడెం 36.4, పెన్‌పహడ్ 11.4, చిలుకూరు 11.6, కోదాడలో 10.4, మేళ్లచెర్వు మండలంలో 7.2 మిల్లీమీటర్లు కురిసింది.
ఫైలిన్ తుపానుతో జిల్లా అంతటా వర్షం
Published Thu, Oct 10 2013 11:39 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement