
పోలీసులను ఆమె తప్పుదారి పట్టించిందా...?
హైదరాబాద్ : వారం క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై కత్తి చూపించి తనతో కారులో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ ఫార్మా ఉద్యోగిని ఫిర్యాదు చేయటటంతో ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు ఆ తర్వాత కేసు దర్యాప్తును నిలిపివేశారు. మూడు నెలల క్రితం మాదాపూర్లతో జరిగిన అభయ ఉదంతంలో కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఫార్మా ఉద్యోగిని ఫిర్యాదుపై అంతగా స్పందించటం లేదు.
ఘటన జరగకున్నా జరిగినట్లు పోలీసులను ఆమె తప్పుదాటి పట్టించిందా...? లేక నిజంగానే ఘటన జరిగినా అందులో క్లూస్ లభించటం లేదా అనే విషయంపై పోలీసులు నోరు విప్పటం లేదు. ఫిర్యాదు చేసిన యువతి దర్యాప్తుకు సహకరించటం లేదని, ఆమె సహకరిస్తేనే దర్యాప్తు ముందుకెళ్తుందని పోలీసులు చెబుతున్నారు. భయపడి దర్యాప్తుకు సహకరించటం లేదా లేక వేరే కారణాలున్నాయా అనేది ఆమె చెప్తేగాని తెలియదని పోలీసులు అంటున్నారు.
ఏదో విషయంపై చర్చించేందుకు తెలిసిన వ్యక్తితో ఆమె ఔటర్పైకి వెళ్లి ఉంటుందని, అతను మరో విధంగా ప్రవర్తించటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ వ్యక్తి వివరాలు బయటపడితే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ఆమె దర్యాప్తుకు సహకరించటం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.