
అవును...అసభ్యంగానే ప్రవర్తించాడు: డీసీపీ
హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డుపై సాప్ట్వేర్ ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన విషయం వాస్తవమేనని మాదాపూర్ డీసీపీ టి. క్రాంతిరాణా అంగీకరించారు. ఆ యువతిని కత్తితో బెదిరించి ఆమె కారులోనే ఔటర్ రింగ్‌రోడ్డు దాకా తీసుకెళ్లాడని ఆయన తెలిపారు. కిడ్నాప్, అత్యాచారయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా హిమాయత్‌సాగర్‌కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని, ఈరోజు ఉదయం ఖాజగూడలోని గుడికి వెళ్లారు. అయితే కారు తాళం వేయడం మరిచిపోయారు. దర్శనం ముగించుకుని కారు డోర్ తీసేసరికి అప్పటికే వెనక సీట్లో ఒక యువకుడు ఉన్నాడు. వెంటనే ఆమె డోర్ మూసేందుకు యత్నించగా, కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఆమె కార్లోకి ఎక్కింది.
అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కారు పోనివ్వాలని బెదిరించాడు. గచ్చిబౌలి - శంషాబాద్ రహదారిలో ముందు సీట్లోకి వచ్చాడు. బాధితురాలు కారు నడుపుతున్న సమయంలోనే స్నేహితురాలికి హెల్ప్ అన్న మెసేజ్ పంపడంతో, ఆమె పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు .. పెట్రోలింగ్ వాహనాలను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫోన్ ఆన్‌లోనే ఉండడంతో, ఆ సిగ్నల్స్ ఆధారంగా ... కారు రూట్‌ను గమనించారు.
దుండగుడి ఆదేశాలతో హిమాయత్ సాగర్ రోడ్డుపై బాధితురాలు తన కారును పార్క్ చేసింది. పోలీసులు వెళ్లి చూడగా .. అప్పటికే నిందితుడు మార్గమధ్యంలో దిగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక వారం క్రితం అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మానస్ రంజన్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని క్రాంతిరాణా తెలిపారు.