48 శాతం ఫిట్‌మెంట్! | Phitment 48 percent! | Sakshi
Sakshi News home page

48 శాతం ఫిట్‌మెంట్!

Published Mon, Jan 12 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

48 శాతం ఫిట్‌మెంట్!

48 శాతం ఫిట్‌మెంట్!

  • గత ప్రభుత్వం ఇచ్చిన పెంపు కంటే తక్కువ ఉండదు
  • 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టనున్న ఉద్యోగ సంఘాలు
  • రేపు ఉద్యోగ సంఘాలతో ఉపసంఘం చర్చలు
  • సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీలో 48 శాతానికి తక్కువ కాకుండా ప్రభుత్వం ఫిట్‌మెంట్ ప్రకటిస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 48 శాతం వద్దే మొదలు పెడుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. గత పీఆర్సీలో ఐఆర్ మీద 77.27 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించారని, ఈ పీఆర్సీలో కూడా అంతకంటే తక్కువ పెంపు ఉండే అవకాశమే లేదని, ప్రస్తుత ఐఆర్ మీద 77.27 శాతం పెంపు ఇచ్చినా ఫిట్‌మెంట్ 48 శాతానికి చేరుతుందని ఉద్యోగులు లెక్కలుగడుతున్నారు. ఫిట్‌మెంట్ 48 శాతం నుంచి ఎక్కడి వరకు వెళుతుందనేది ఉద్యోగ సంఘాల పట్టు మీద ఆధారపడి ఉం టుందని సగటు ఉద్యోగి అంచనా వేస్తున్నారు.

    సంక్రాంతికి ప్రకటన చేసే అవకాశం

    సంక్రాంతి కానుకగా పీఆర్సీ అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడంతో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఒకరోజు ముందు.. 13న మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల చర్చలు జరగనున్నాయి. మంగళవారం జరగనున్న ఈ చర్చల్లో ఫిట్‌మెంట్‌ను తేల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు విశ్వసిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కనీసం ఫిట్‌మెంట్‌పైన అయినా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థిక లబ్ధి ఎప్పటి నుంచి ఇవ్వాలనే విషయాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. 69 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ఉద్యోగులు డిమాండ్ చేసినంత ఫిట్‌మెంట్ ఇవ్వకపోయినా, సంతృప్తికర స్థాయిలోనే నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 48 శాతం కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ఉండే అవకాశం లేదని, అంతకంటే తక్కువ ఇస్తామని ఉపసంఘం కూడా ప్రతిపాదించదని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. గత పీఆర్సీ సమయంలో మధ్యంతర భృతి (ఐఆర్) 22 శాతం ఇచ్చారు. తొమ్మిదో పీఆర్సీ 27 శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ అమలవుతోంది.

    పదో పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన విషయం విదితమే. గత పీఆర్సీ సిఫారసు చేసిన 27 శాతం మీద 44.5 శాతం అధికంగా 39 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పీఆర్సీలో కూడా సిఫారసు చేసిన దానికి కంటే 45 శాతం అధికంగా ప్రభుత్వం ఇస్తే.. 42 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. గత పీఆర్సీ సమయంలో 22 శాతం ఐఆర్ ఉండగా, దాని మీద 77.27 శాతం అధికంగా ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్ మీద 77 శాతం అధికంగా ఇస్తే.. ఫిట్‌మెంట్ 48 శాతానికి చేరుతుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే తక్కువగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం లేదని, ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా ఫిట్‌మెంట్ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఫిట్‌మెంట్ 48 శాతం కంటే ఎక్కువే ఉంటుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు.
     
    ఉద్యోగుల కార్యాచరణ నేడు ఖరారు

    మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఉద్యోగ సంఘాల జేఏసీ సోమవారం ఖరారు చేయనుంది. ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీఎన్జీవో హోమ్‌లో నిర్వహించనున్నారు.
     
    ఉద్యోగుల అంచనా ఇలా..
    ఐఆర్‌ను పాయింట్లలో తీసుకుంటే..
    గత పీఆర్సీలో ఐఆర్ = 22 పాయింట్లు
    గత ఫిట్‌మెంట్    = 39 పాయింట్లు
    ఐఆర్ మీద పెంపు శాతం = 77.27 శాతం (17 పాయింట్లు)
    ప్రస్తుతం ఐఆర్    = 27 పాయింట్లు
    గతంలో పెంపు శాతం = 77.27 శాతం
    పెంపు పాయింట్లు    = 21 పాయింట్లు
    ఈమేరకు పెంచితే    = 48 పాయింట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement