జగన్ దీక్షకు రండి
గుంటూరు సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీని కాంక్షిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపడుతున్న రైతుదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్‌పేటలోని జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు.
ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీని తుంగలో తొక్కే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజధాని అంశం చుట్టూనే తిరుగుతూ మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సన్నద్ధమయ్యారని మండిపడ్డారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబుకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందనుకోవడం భ్రమే అవుతుందన్నారు. రైతులు, మహిళలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబన్నారు. ప్రస్తుతం రాజధాని పేరుతో మరో నాటకానికి నిస్సిగ్గుగా తెర తీశారనీ, ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి నిజమైన పాలన చేయాలని ఎమ్మెల్యే హితవు పలికారు.
జగన్ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఓ పక్క రుణం మాఫీ కాక, మరో పక్క కొత్త రుణం పుట్టక, గిట్టుబాటు ధర దక్కక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి పీఠమె క్కిన బాబు ప్రస్తుతం ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కక రైతులు అల్లాడుతున్నారన్నారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షకు అందరూ సంఘీభావం ప్రకటించాల్సి ఉందన్నారు.
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, రైతులు, మహిళలతో పాటు విద్యార్థులు, యువజనులను కూడా చంద్రబాబు ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు యువతకు ముఖం చాటేస్తున్నారన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితరాలకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని ముల్లుగర్ర పెట్టి లేపే రీతిలో జగన్ తలపెట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం జగన్ రైతు దీక్ష పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు.
విలేకరుల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, ఎస్టీ సెల్ కన్వీనర్ మీరాజ్యోత్ హనుమంతునాయక్, రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, విద్యార్థి విభాగం కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి, మండెపూడి పురుషోత్తం, యనమల ప్రకాష్, సిద్ధయ్య, మేరువ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.