పుట్లూరులో కుక్కపిల్లలఆకలి తీరుస్తున్న వరాహం ,శింగనమలలో కుక్క పిల్లలకు పాలిస్తున్న పంది
శింగనమల/పుట్లూరు: సహజంగా పందులు కనిపిస్తే కుక్కలు వెంటబడి తరుముతుంటాయి. అదేస్థాయిలో అసహాయ స్థితిలో ఉన్న కుక్కపిల్లలను తీవ్రంగా గాయపరిచి పందులు చంపేస్తుంటాయి. అలాంటిది జాతి వైరాన్ని మరిచి శునకం పిల్లలకు తమ స్తన్యాన్ని అందిస్తున్నాయి సుకరాలు! వివరాల్లోకి వెళితే.. శింగనమలలో వారం రోజుల క్రితం ఐదు పిల్లలకు ఓ కుక్క జన్మనిచ్చింది. ఆ తర్వాత ప్రమాదవశాత్తు తల్లి కుక్క వాహనాల కిందపడి చనిపోయింది. ఆకలి తట్టుకోలేక విలవిల్లాడుతున్న కుక్కపిల్లలను గమనించిన ఓ వరాహం.. వాటిని కరవకుండా పాలిస్తూ వస్తోంది. ఇలాంటిదే పుట్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోనూ చోటు చేసుకుంది. పదిరోజులుగా ఓ వరాహం క్రమం తప్పకుండా నాలుగు కుక్కపిల్లలకు పాలిస్తోంది. అనారోగ్యం కారణంగా పిల్లలకు తల్లి కుక్క పాలు ఇవ్వడం లేదు. దీంతో ఉదయం 9 గంటలకు ఓ వరాహం అక్కడకు చేరుకుని గంట పాటు కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment