
గులాబీ నేతలకు పరీక్ష
మునిసిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌లకు పరీక్షగా మారాయి. ఆ పార్టీ నియోజకవర్గ నేతలతోపాటు ఎన్నికల ఇన్‌చార్జ్‌లకు సవాల్‌గా నిలిచాయి. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఉన్నందున టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మునిసి‘పోల్స్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఆయూ మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇద్దరు చొప్పున ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఏమరుపాటు లేకుండా మునిసిపాలిటీలు, నగర పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేయాలని స్పష్టం చేశారు.
అలసత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు.. సాధారణ ఎన్నికల్లో టికెట్ రావాలంటే మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని మెలిక పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో సునాయూసంగా అసెంబ్లీలో అడుగుపెడదామని భావించిన ఆశావహులకు కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లరుుంది. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లలో గుండె దడ పెరిగింది. తెలంగాణ వచ్చిన నేపథ్యంలో తమదే విజయమనే బీరాలు పలుకుతున్నప్పటికీ... అంతర్గతంగా వారిలో గుబులు నెలకొంది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరిగే జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌లకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే మొలుగూరి, సిరికొండ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సంగూలాల్ నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి స్వస్థలం మహబూబాబాద్ కావడంతో ఆయనకు ఇక్కడ గెలుపు సవాల్‌గా మారింది.
వ్యూహాత్మకంగా సాగుతున్న నేతలు
కేసీఆర్ ఝలక్ నేపథ్యంలో ఆయూ నియోజకవర్గ నేతలతోపాటు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. జిల్లా ముఖ్య నేతలంతా దృష్టి కేంద్రీకరించి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఈ దిశలోనే మహబూబాబాద్‌కు చెందిన టీడీపీ నేత డాక్టర్ నెహ్రూనాయక్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో పొత్తులేకుండా ఒంటరిగా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరికి పరకాల ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకం కానున్నది.
రంగంలోకి దిగిన ఎన్నికల ఇన్‌చార్జ్‌లు
జనగామకు పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, పరకాలకు కడియం శ్రీహరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు అజ్మీరా చందూలాల్, భూపాలపల్లికి ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, నర్సంపేటకు పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ సుధాకర్‌రావు, వర్ధన్నపేట ఇన్‌చార్జ్ ఆరూరి రమేష్, మహబూబాబాద్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు, వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ల ఎంపిక నుంచి ప్రచారంతో పాటు పోలింగ్ ముగిసేవరకు పూర్తి బాధ్యత వీరిదే. ఇప్పటికే ఈ వీరు స్థానికంగా ఉండే ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు.