
ప్రజాస్వామ్యం ఖూనీ
మాచర్లటౌన్ : టీడీపీ నాయకులు అధికార బలం ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన పట్టణంలో వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను దారుణంగా చంపుతుంటే ఆ విషయాన్ని నిలదీస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా అధికారపక్షం వ్యవహరించడం ఏ సభా సంప్రదాయమని ప్రశ్నించారు. సభలో నిరసన వ్యక్తం చేసేందుకు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వకపోవడం టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదరుకాలేదని, అందరినీ సమదృష్టితో చూడాల్సిన స్పీకర్ ఇలా వ్యవహరించడం సభా సంప్రదాయం కాదనిపేర్కొన్నారు.
టీడీపీ ఆగడాలను ప్రజలకు వివరిద్దాం..
గడచిన మూడు నెలల్లో అనేక మంది తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు బలిగొన్నారన్నారు. దీనిపై చర్చించకుండా ఎప్పుడో పాత సంఘటనలు ప్రస్తావించి అసలు విషయాన్ని చర్చకు రాకుండా సభను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పరిటాల రవి హత్య కేసు విచారణ పూర్తయి నిందితులు కూడా శిక్షకు గురైతే ఆ సంఘటనను పట్టుకుని జగన్‌పై నిందారోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలను స్మగ్లర్లంటూ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
తమ నాయకుడిపై కావాలనే టీడీపీ నాయకులు ఎదురుదాడి చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని, టీడీపీకి తొందరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మనోధైర్యంతో అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొని వారి దౌర్జన్యాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు, పార్టీ న్యాయవాద విభాగ నాయకులు కుర్రి సాయిమార్కొండారెడ్డి పాల్గొన్నారు.