చీరాల, న్యూస్‌లైన్: చీరాల కేంద్రంగా పైరసీ రాకెట్ దూసుకుపోతోంది. కొత్త సినిమా ఇలా రిలీజవగానే..వాటి సీడీలు, డీవీడీలు రోడ్లపక్కన తోపుడు బండ్లపై అలా ప్రత్యక్షమవుతున్నాయి. కొత్త సినిమాల డీవీడీలను తక్కువ ధరకే విక్రయిస్తూ బహిరంగంగానే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఐడీ పార్టీకి చెందిన ఓ కానిస్టేబుల్ హస్తం ఉండటం వల్లే పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సంగం థియేటర్, వాసవీ క్లాత్‌మార్కెట్, ముంతావారిసెంటర్ తదితర ప్రాంతాల్లో పైరసీ మార్కెట్ కొనసాగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది.
చీరాల పట్టణంలో కొన్నేళ్లుగా పైరసీ మార్కెట్‌ను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అయితే, కొంతకాలంగా బహిరంగంగానే రోడ్లపక్కన తోపుడుబండ్లపై కొత్త సినిమాల సీడీలు, డీవీడీలు ఉంచి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అదీకూడా స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వందమీటర్లలోపే వాటిని విక్రయిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఆ తోపుడుబండ్ల ముందుగా రోజూ అనేకసార్లు పోలీసులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఐడీ పార్టీకి చెందిన ఓ కానిస్టేబుల్ పైరసీ మార్కెట్‌కు సూత్రధారి కావడం వల్లే పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చిత్రపరిశ్రమంతా పైరసీపై ఫైట్‌చేస్తుంటే స్థానిక పోలీసులు మాత్రం తెలిసీ కూడా తెలియనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీరాలకు గుంటూరు నుంచి పైరసీ సీడీలు, డీవీడీలు సరఫరా అవుతున్నట్లు సమాచారం.
పెద్ద ఎత్తున వ్యాపారం...
చీరాల పట్టణంలో తోపుడుబండ్లపై పైరసీ సీడీలు, డీవీడీల వ్యాపారం పెద్దఎత్తున జరుగుతోంది. కొత్త సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాలంటే ఒక్కొక్కరికి వంద రూపాయల వరకూ ఖర్చవుతోంది. అయితే, పైరసీ ద్వారా 9 కొత్త సినిమాలతో కూడిన 3 డీవీడీలను 100 రూపాయలకే విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అధిక సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తున్నారు.
పైగా, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు కూడా పైరసీ మార్కెట్లో లభిస్తుండటంతో రోజుకు వేల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చిత్రపరిశ్రమకు తీవ్రనష్టం కలిగిస్తున్న పైరసీ వ్యాపారాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది.