
పిస్టల్ కలకలం...
పిస్టల్, ఐదు బుల్లెట్లతో ఇద్దరి అరెస్టు
గంజాయి స్మగ్లర్లు ఇచ్చారంటున్న నిందితులు
మావోలకు చేరవేస్తున్నారని అనుమానం
పెదబయలు : మండలంలో ఆదివారం రాత్రి పోలీసులు ఇద్దరు గిరిజనులకు ఆదుపులో తీసుకుని వారి నుంచి పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం, పెదకోడాపల్లి పంచాయితీ కొత్తపోయిపల్లి గ్రామానికి చెందిన పాంగి భాస్కర్‌రావు, ఇదే గ్రామానికి చెందిన భాస్కర్‌రావుల నుంచి ఐదు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన గంజా యి స్మగ్లర్ గంజాయి కొనుగోలు చేసి, కొంత సొమ్ము చెల్లించాడు. మిగతా డబ్బు కోసం పిస్టల్‌ను తనఖా పెట్టాడు. అయితే ఐదు నెలలు గడిచినా మహారాష్ట్ర స్మగ్లర్ రాకపోవడంలో పిస్టల్‌ను విక్రయించాలని భాస్కరరావులు ఇద్దరూ భావించారు. మారుమూల ప్రాంతంలో దానిని విక్రయించడానికి ఇద్దరూ కలిసి ఆదివారం పిస్టల్ పట్టుకుని వెళుతున్న సమయంలో పెదకోడాపల్లి లక్ష్మీపేట మార్గమధ్యంలో పోలీసులకు దొరికిపోయారు.
పిస్టల్‌తో దొరికిన పాంగి భాస్కర్‌రావు గతంలో 15 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పాడేరులో రెడ్డి జ్యూయలరీపై దాడి కేసులో నిందితుడు కావడంతో పోలీసులు అతను చెప్పినదానిపై ఆధారపడకుండా భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నిజంగా గంజాయి స్మగ్లర్లు పిస్టల్, బుల్లెట్లు డబ్బు కోసం ఉంచి వెళ్లారా? లేక మావోయిస్టులకు చేరవేతకు తరలిస్తున్నారా? అనేది విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై పాడేరు సీఐ సాయిని ‘సాక్షి’ వివరణ కోరగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.