జరీబు రైతు గరం..గరం..
భూములు ఇచ్చిన చోటే స్థలాలు ఇవ్వాలి..
లేకుంటే రాజధాని నిర్మాణ పనులను సాగనివ్వం
అప్పుడు ఇంటింటికీ తిరిగిన మంత్రులు ముఖం చాటేశారు..
ఇప్పుడు వస్తున్న అధికారుల హామీలను ఎలా నమ్మాలి..
ప్రభుత్వ వైఖరిపై మండిపడిన రైతు సంఘం నేతలు
ఉద్దండ్రాయునిపాలెంలో సీఆర్‌డీఏ కమిషనర్‌పై ప్రశ్నలు గుప్పించిన గ్రామస్తులు, మహిళలు
గుంటూరు : రాజధాని మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సుల్లో అధికారులు ఎన్ని మాయమాటలు చెబుతున్నా, జరీబు రైతులు వెనుకంజ వేయడం లేదు. తాము ఏ గ్రామంలో భూములు ఇచ్చామో అక్కడే స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగనిచ్చేది లేదంటున్నారు. అవసరమైతే రాజధానిని వేరే ప్రాంతానికి తరలించుకోండని అధికారులను హెచ్చరిస్తున్నారు. అవగాహన సదస్సులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజధాని భూ సమీకరణకు సహకరించిన టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరుకు ఆవేదన చెందుతున్నారు. తమ మాటలు నమ్మి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం రోజుకో మాట చెబుతుంటే, రైతులకు సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, గ్రామాల్లో తిరగలేకపోతున్నామని టీడీపీ ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో రైతులు తిరుగుబాటు చేయడంతో సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ ఆదివారం తుళ్ళూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, రైతుల సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఉద్దండ్రాయునిపాలెంలో రైతు సంఘనేత అనుమోలు సత్యనారాయణ, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్‌పీటీసీ బెజవాడ నరేంద్రలు ఫ్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు ఇప్పుడు అవగాహన కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, అప్పుడు జరీబు ప్రాంతంలోనే స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనిపించడం లేదని, ఇప్పుడు అధికారులు ఇచ్చే హామీలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రతీ అంశానికి చట్టబద్ధత కల్పించాలని, మాస్టర్‌ప్లాన్‌ను తెలుగు లోకి అనువదించి అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రోడ్ గ్రిడ్ ఏర్పాటుతో అనేక గ్రామాల్లోని ఇళ్లు, నివేశన స్థలాలు పోయే పరిస్థితి ఉంటే, వాటికి సమాధానం చెప్పకుండా ఇలా ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కార్యక్రమాన్ని త్వరగా ముగించి వెళ్ళిపోయారు.