కాపులుప్పాడలో వైద్యుడి భూమి దురాక్రమణ
నకిలీ డాక్యుమెంట్లు, వారసులను పుట్టించిన ఘనులు
రూ.3 కోట్లకు పైగా విలువైన భూమిలో కబ్జాదారుల పాగా
ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు విభాగాలు
నగరంలో ఆయనో ప్రముఖ వైద్యుడు. తన వారసుల కోసం ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొంత స్థలం కొనుగోలు చేశారు. కొంత కాలం అందులో వ్యవసాయం చేయించినా ఆ తర్వాత దాన్ని ఖాళీగా వదిలేశారు.ఇటీవలి కాలంలో నగరంలో భూములు బంగారంగా మారాయి. ఈ వైద్యుడి భూమి ధర కూడా కోట్లకు పెరిగింది. సహజంగా అది కబ్జాదారులను ఆకర్షించింది. అంతే.. కొద్దిరోజుల క్రితం ఆ భూమిలో ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ భూమి తమదంటూ గౌతమ్ అనే వ్యక్తి పేరుతో వెలసిన ఆ బోర్డు చూసి వైద్యుడు అవాక్కయ్యారు. అందులో ఉన్న నెంబరుకు ఫోన్ చేస్తే రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పి అవతలి వ్యక్తి ఫోను పెట్టాశారు.అప్పటి నుంచీ సదరు వైద్యుడి పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్నట్లు తయారైంది. భూమికి సంబంధించి తన వద్ద ఉన్న దస్తావేజులు పట్టుకొని తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, పోలీస్‌స్టేషన్.. ఇలా అన్నిచోట్లకు వెళ్లి మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం.. కబ్జాదారులకు రాజకీయ పెద్దల ప్రాపకం ఉండటమే!..
విశాఖపట్నం : భూమే బంగారంగా మారిన విశాఖ నగరంలో కోట్ల విలువైన స్థలాల కబ్జాలు.. డబుల్, త్రిబుల్ ఎంట్రీలతో రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి అసలు వారసులు, పట్టాదారులు ఎవరన్నది నిర్థారించుకోకుండానే ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దీంతో అసలు పట్టాదారులు అన్యాయమైపోతున్నారు. ఓ ప్రముఖ వైద్యుడికే ఇలాంటి అన్యాయం జరిగిందంటే.. ఇక సామాన్యుల భూములకు రక్షణ ఎక్కడుంటుంది!.
రెండున్నర దశాబ్దాల క్రితం..
నగరంలో ప్రముఖ వైద్యుడైన బి.బాలచంద్రుడు 1991లో కాపులుప్పాడ సర్వే నెం.29-3లో 47 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఒకప్పుడు ఆ భూమి కొల్లి అప్పయ్య, గుడ్ల తమ్మయ్యల ఉమ్మడి యాజమాన్యంలో ఉండేది. అప్పయ్య కుమారులు కొల్లి యర్రయ్య, రామస్వామిల నుంచి ఇరవైమూడున్నర సెంట్లు, తమ్మయ్య కుమారుడు రామ్మూర్తి నుంచి మరో ఇరవైమూన్నర సెంట్లు చొప్పున సింగవరపు సుధాకర్ కొనుగోలు చేశారు. ఆయన నుంచి బాలచంద్రుడు కొనుగోలు చేసి.. తనతో పాటు తన భార్య కమలాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చాలా కాలం పాటు ఆ భూమిలో వ్యవసాయం కూడా చేయించారు కూడా.
నకిలీ వారసులతో నాటకం
నగరం పెరగడంతో భూములు, స్థలాల రేట్లు పెరిగి బంగారంలా మారాయి. కాపులుప్పాడలోని బాలచంద్రుడి స్థలం విలువ కూడా కోట్లకు పెరిగింది. దాంతో కబ్జాదారులు దానిపై కన్నేశారు. కొల్లి అప్పయ్య వారసులంటూ లేని 23 మందిని సృష్టించారు. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయించారు. వారి నుంచి ఈ భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఓ వ్యక్తి.. ఆ స్థలం తనదేనంటూ బోర్డు కూడా పెట్టేశారు. విషయం తెలిసి బాలచంద్రుడు తన స్థలంలో పాతిన బోర్డుపై ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేశారు. తాను అక్కడి రైతుల నుంచి ఆ స్థలం కొన్నానని అవతలి వ్యక్తి సమాధానమిచ్చారు. 1991లోనే తాను కొనుగోలు చేసి, చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని తన ప్రమేయం లేకుండా అతనెలా కొన్నాడో వైద్యుడికి అర్ధం కాలేదు.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
దీనికి కొద్ది రోజుల ముందే బాలచంద్రుడు మండల తహశీల్దార్‌ను కలిసి ఆన్‌లైన్ పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేశారు. కానీ ఆ స్థలం తనదంటూ మరో వ్యక్తి కూడా వచ్చారని, ఇద్దరూ న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించి తహశీల్దార్ తప్పించుకున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ భీమునిపట్నం పోలీసులను ఆశ్రయించారు. వారు ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం తప్పుడు రిజిస్ట్రేషన్ అయినా ఆపుదామని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి సర్వే నెంబర్ 29-3లోనిది తనకు, తన భార్యకు చెందిన భూమి అని, ఈ సర్వే నెంబర్‌పై రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎవరైనా వస్తే చేయవద్దని విన్నవించారు. ఆక్కడా తహశీల్దార్ కార్యాలయంలో వచ్చిన సమాధానమే వచ్చింది. భూమి తమదేనని తెలిపే అన్ని పత్రాలను ఈ మూడు చోట్లా ఆయన సమర్పించారు. కానీ ఏ ఒక్కరూ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కనీసం వాటి వివరాలు పరిశీలించడానికి కూడా పూనుకోలేదు. దీనికి కారణం కబ్జాకు పాల్పడిన వారికి రాజకీయ పెద్దల అండదండలుండటమేనని తెలుస్తోంది.
నాలుగైదుసార్లు వెళ్లాం
మా భూమిని కాపాడమని సీఐ అప్పలనాయుడుకి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వలేదు. నాలుగైదుసార్లు ఆయన చుట్టూ తిరిగాం. చూస్తాం చేస్తాం అంటూ పట్టించుకోలేదు. చివరికి మా స్థలంలో ఎవరో ఏకంగా బోర్డు పాతేశారు. మా సర్వే నెంబర్‌పై ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వస్తే చేయవద్దని రిజిస్ట్రార్‌కు పిటిషన్ ఇచ్చాం. ఆయన రిజిస్ట్రేషన్ ఆపడం కుదరదన్నారు. ఆన్‌లైన్ పాసుపుస్తకం ఇమ్మని తహశీల్దార్ రామారావుకు దరఖాస్తు చేశాం. వివాదంలో ఉన్నదానికి ఇవ్వలేమని కోర్టులో తేల్చుకోమని ఆయన చేతులు దులుపుకున్నారు. ఇంక మాకు న్యాయం చేసేదెవరు. - బలుసు బాలచంద్రుడు, బాధితుడు
ఆ సమస్య లేదనుకున్నాం
తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ బలుసు బాలచంద్రుడు అనే వ్యక్తి నాలుగైదు నెలల క్రితం మా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే మా సిబ్బంది ఆయనను తీసుకుని ఆ భూమి వద్దకు వెళ్లారు. సరిహద్దులు వేయించి, ఏదైనా సమస్య వస్తే చెప్పమన్నాం. అయితే ఆ తర్వాత బాలచంద్రుడు మా వద్దకు రాలేదు. సమస్య లేదనుకుని ఊరుకున్నాం. కబ్జా జరిగినట్లు ఆయన వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - టి.అప్పలనాయడు, సీఐ, భీమిలి.