సాదాసీదా సమీక్ష | Plain review | Sakshi
Sakshi News home page

సాదాసీదా సమీక్ష

Published Sat, Jun 28 2014 2:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

సాదాసీదా సమీక్ష - Sakshi

సాదాసీదా సమీక్ష

శుక్రవారం అనంతపురంలోని రెవెన్యూ భవన్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, చిత్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తదితరులు
 
 అనంతపురం కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష కాస్త సాదాసీదాగా ముగిసింది. మూడు అంశాలపై మూడున్నర గంటలపాటు చర్చించారు. మిగతా అంశాలను ప్రస్తావించలేదు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతపురం, హిందూపురం ఎపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప గైర్హాజరయ్యారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై తొలిసారి సమీక్ష ఏర్పాటు చేశారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ సమీక్ష ప్రారంభించారు.
 
 తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలపై చర్చించారు. విద్య, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర పథకాలపై సమీక్ష జరపకుండానే ముగించేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యేలు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకర్‌రావును నిలదీశారు. దీనిపై ఎస్‌ఈ వివరణ ఇస్తూ 1258 గ్రామాల్లో నీటి సమస్య ఉందన్నారు. ధర్మవరం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య పరిష్కారానికి రూ. 160 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు.
 
 తాగునీటి పథకాల కరెంట్ బిల్లులు రూ.109 కోట్ల మేర పేరుకుపోయాయని, వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పరిష్కరించేందుకు చేపట్టిన చర్యలను వివరించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాదరెడ్డిని కోరారు. రెండేళ్లు కావస్తున్నా రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు మంజూరు చేయడం లేదని నిలదీశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల సమస్య పరిష్కరించాలని సూచించారు. నాణ్యమైన విత్తనం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జేడీకి సూచించారు.
 
 తీర్మానాలు
 
 గుంతకల్లును రైల్వే జోన్ చేయాలి
  తాగునీటి సమస్యకు నాన్ సీఆర్‌ఎఫ్ పండ్ కింద రూ. 8 కోట్లు కేటాయించాలి.
  రూ. 10 కోట్లతో రిజర్వు పండ్ ఉంచాలి. ఏదైనా నియోజకవర్గంలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు వీటిని వినియోగించాలి.
  తాగునీటి పథకాలకు 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలి
  చేతి పంపుల మర్మమ్మతుకు మెకానిక్‌లను నియమించాలి.
  రూ. 5 వేల కోట్ల తాగునీటి పథకాలన్నింటిపై విచారణ చేయాలి.
  జిల్లాకు 7,400 కిలోమీటర్ల విద్యుత్ వైర్, 7 వేల ట్రాన్స్‌ఫార్మర్లు, 65 వేల విద్యుత్ స్తంభాలు కేటాయించాలి.
 ‘అనంత’కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 10 వేల కోట్లు కేటాయించాలి.
 రూ. 7,476 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలు చేయాలి
  జిల్లాలో ఐఐటీ, ఐటీఐఆర్, టెక్స్‌టైల్ పార్కు, సోలార్ ఎనర్జీ సంస్థలు ఏర్పాటు చేయాలి
 పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నికర జలాలు కేటాయించాలి.
 
 ఎయిమ్స్, ఐఐటీ సంస్థలు ఏర్పాటు చేయాలి
 జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. గుంతకల్లును రైల్వే జోన్‌గా గుర్తించాలి. ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఐఐటీ, ఇతర జాతీయ సంస్థలు ఏర్పాటు చేసేలా తీర్మానంలో పెట్టాలి.    
 -విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ
 
 విద్యుత్ సరఫరా మెరుగు పరచాలి
 కదిరికి పార్నపల్లి నుంచి తాగునీరు రావాల్సి ఉంది. రెండు ప్రాంతాలకూ ఒకే లైన్ మీదుగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కదిరిలో కొంతమంది రైతులు డీడీలు కట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు కనెక్షన్ మంజూరు చేయలేదు. త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలి.
  - అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి
 
 ట్యాంకరు రవాణా చార్జీలు పెంచాలి
 పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్‌ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. నీటి సరఫరా నిమిత్తం ట్రాక్టర్‌కు ఇస్తున్న రూ.350 నుంచి రూ.500 పెంచాలి.
 -బీకే పార్థసారథి, ఎమ్మెల్యే, పెనుకొండ
 
 చెరువులు నింపాలి
 జిల్లాలో భూగర్భ జాలాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడి చెరువులు నింపిన తరువాతే కడప జిల్లాకు నీటిని వదలాలి. జిల్లా కోటా మేరకు పూర్తి స్ధాయిలో నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
 -జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాడిపత్రి
 
 చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
 తాగునీటి సమస్య తీరాలంటే చెరువులను నీటితో నింపేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ జరిపించాలి.
 - వరదాపురం సూరి, ఎమ్మెల్యే, ధర్మవరం
 
 శింగనమల చెరువును గుర్తించాలి
 శింగనమల చెరువు ప్రాధాన్యతను గుర్తించండి. చెరువును నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలి.
 - యామినీ బాల, ప్రభుత్వ విప్
 
 ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలి
 గత ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలి.                                   
 - గేయానంద్, ఎమ్మెల్సీ
 
 అగళిలో నీటి సమస్య పరిష్కరించండి
 మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అగళిలో సమావేశానికి వెళ్లినప్పుడు ప్రజలు తాగునీటి సమస్యపై నిలదీశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఉన్నా ప్రయోజనం లేదు. మొదట అగళిలో నీటి సమస్య పరిష్కరించండి.
 - ఈరన్న, ఎమ్మెల్యే, మడకశిర  
 
 కాలువలు సరి చేయాలి
 హంద్రీనీవా నీరు సక్రమంగా అందడం లేదు. మరమ్మతులు చేపట్టి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి.
 - ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్యే, అనంతపురం
 
 టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి
 రాయదుర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవకాశాలున్నాయి. టెక్స్‌టైల్ పార్క్, సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.                             
 - మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ
 
 మోటార్లు కాలిపోతున్నాయి
 గుత్తి, గుంతకల్లు, వైటీ చెరువులలో తాగునీటి కొరత ఉంది. మోటార్లు కాలిపోతున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలి.
 - జితేందర్‌గౌడ్, ఎమ్మెల్యే, గుంతకల్లు
 
 కరెంట్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి
 జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ భారంగా ఉంది. రూ.109 కోట్ల కరెంటు బకాయిలు ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదన పంపాలి.                     
 - కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్ విప్
 
 హంద్రీనీవా త్వరగా పూర్తి చేయాలి
 ‘అనంత’లో తాగునీటి సమస్య పరిష్కారానికి హంద్రీనీవా కాంట్రాక్టర్‌లపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.                           
 - బాలకృష్ణ, ఎమ్మెల్యే, హిందూపురం
 
 అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
 జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ ఉన్నా అధునాతన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలి. సమష్టిగా జిల్లా అభివృద్ధికి కలిసి రావాలి.
 -మంత్రులు పల్లె రఘునాథరెడ్డి,  పరిటాలసునీత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement