అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : క్వింటా రూ.4 వేల మద్దతు ధరతో వేరుశనగ కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. అనంతపురం, ధర్మవరం, గుత్తి, పెనుకొండ, ఉరవకొండ, కళ్యాణదుర్గం తదితర మార్కెట్‌యార్డుల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు 50 వేల క్వింటాళ్లు సేకరించారు.
గడువు ముగియనుండటంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. అయితే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాటాలు, హమాలీలు తక్కువగా ఉండటంతో తూకాలు వేయడం ఆలస్యమవుతోంది. దీనికితోడు వేరుశనగను నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో బయటే ఉంచుతున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు వచ్చిన సరుకును తీసుకుని రెండు మూడు రోజుల్లో తూకాలు వేయడానికి చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ డీఎం ఏకాంబరరాజు తెలిపారు. ఆ తర్వాత వచ్చే వేరుశనగకాయలను తీసుకోబోమన్నారు.
నేడు అదనపు కాటాలు
మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సి.రామాంజినేయులు గురువారం అనంతపురం మార్కెట్‌యార్డులోని వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రెండో కౌంటరు సరిగా పనిచేయడం లేదని, తూకాలు వేయడంలో చాలా ఆలస్యం జరుగుతోందని రైతులు ఫిర్యాదు చేశారు.
వ్యాపారులు, దళారుల బెడద కూడా ఉందని మండిపడ్డారు. వ్యాపారులు ఎవరో పసిగట్టి సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ రైతులకు చెప్పారు. శుక్రవారం నుంచి ఇపుడున్న ఐదు కాటాలకు అదనంగా మరో నాలుగు కాటాలతో తూకాలు వేస్తామని హామీ ఇచ్చారు.
ఆచరణకు నోచుకోని డెరైక్టర్ హామీ
వేరుశనగ కొనుగోళ్లు గడువు ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తామని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇసార్ అహ్మద్ ఈ నెల 27న హామీ ఇచ్చారు. శుక్రవారం గడువు ముగియబోతున్నా.. పొడిగింపు ఉత్తర్వులు మాత్రం అందలేదు. దీనిపై నేడు మార్కెటింగ్ శాఖ కమిషనర్ నిర్వహించే వీడియో కాన్షరెన్‌సలో నిర్ణయం వెలువడనుంది. గడువు పొడిగించకపోతే మాత్రం రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
జాగారమే!
గుత్తి, న్యూస్‌లైన్ : గుత్తి మార్కెట్‌యార్డులో వేరుశనగ కాయల విక్రయాల కోసం అన్నదాతలు రెండు రోజులుగా జాగరణ చేస్తున్నారు. ఈ నెల 22న ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పది గంటల వరకు గుత్తితో పాటు పామిడి, గుంతకల్లు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన 2800 మంది రైతులు వేరుశనగ కాయలను తీసుకొచ్చారు. ఇందులో టోకెన్లు తీసుకున్న 1500 మంది రైతులకు సంబంధించిన వేరుశనగ కాయలు కాటా వేశారు.
మిగతా 1300 మంది రైతులు టోకెన్లు తీసకుని కాటా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే కొనుగోలు గడువు శుక్రవారంతో ముగియనుందని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెప్పడంతో దిక్కతోచడం లేదని రైతులు వాపోతున్నారు. చలికి వణికుతూ, దోమల కాటుకు గురవుతూ అన్నపానీయాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలంటే కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. కొనుగోలు కేంద్రంలో అయితే క్వింటాకు రూ.4 వేలు మద్దతు ధర ఇస్తున్నారు. దీంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్చుకుని మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు.
నేటితో కొనుగోళ్లు బంద్!
Published Fri, Jan 31 2014 2:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement