
సాక్షి, గుంటూరు : చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం..నిందితులను పట్టుకుని మాకు న్యాయం చేయండి అంటూ పలువురు బాధితులు పోలీస్ అధికారులను వేడుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీలు సీతారామయ్య, లక్ష్మీనారాయణ సుమారు 100 ఫిర్యాదులు పరిశీలించారు. ఎక్కువగా కుటుంబ ఆస్తి వివాదాలు, భార్యాభర్తల కలహాలపై ఫిర్యాదులు అందాయి. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని రూరల్ స్పందన కేంద్రంలో సోమవారం స్పందన జరిగింది. డీఎస్పీలు గోలి లక్ష్మయ్య, రవికృష్ణకుమార్ బాధితుల నుంచి 60కుపైగా దరఖాస్తులను స్వీకరించారు. పలువురు వివిధ ఘటనల్లో మోసపోయామని ఫిర్యాదు చేశారు. పలువురి సమస్యలు వారి మాటల్లోనే..
రూ.లక్షతో ఉడాయించింది
వినుకొండ, నరసరావుపేట మున్సిపాల్టీలు, గుం టూరు కార్పొరేషన్‌లో సివిల్ కాంట్రాక్టు పనులు చేశా. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏప్రిల్‌లో కాకుమాను మండలం బోడుపాలెం గ్రామానికి చెంది మామిళ్లపల్లి దీప్తి సెక్రటేరియట్‌లో పరిచయమైంది. సీఎంవోలో పీఏ అని చెప్పింది. పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తానని నమ్మించింది. ఆమె అకౌంట్‌లో రూ.లక్ష వేశాను. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడంలేదు. ఆమెను పట్టుకుని న్యాయం చేయాలి.
–మన్నవ వంశీకృష్ణ, గుంటూరు, కృష్ణనగర్
చీటీ డబ్బులతో పరారయ్యారు
మెడబలిమి శ్యామ్‌కుమార్, శ్యామలాదేవి దంపతులు కాకానిలో షెర్లి బ్యూటీపార్లర్ నిర్వహించే వారు. ఐదేళ్ల నుంచి నమ్మకంగా చీటీలు వేశారు. రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.లక్ష చీటీలు వేసి 16, 18 నెలలు చెల్లించాం. ఏప్రిల్ నెలలో దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
–కె.రవికుమార్, త్రివేణి, అనురాధ తదితరులు, కాకాని
ఉల్లిపాయల గ్రేడింగ్ పేరుతో మోసం
నగరంపాలెంలో కింగ్ ఆనియన్స్ పేరుతో అనుపర్తి జోసఫ్‌రాజు కార్యాలయం ప్రారంభించాడు. ఉల్లిపాయలు గ్రేడింగ్ చేసి ఇస్తే రోజుకు 2,000 ఆదాయం వస్తుందని చెప్పాడు. ముందుగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 25 వేలు డిపాజిట్ తీసుకుని కొద్దిరోజులు మా నివాసాలకు ఉల్లిపాయలు పంపాడు. గ్రేడింగ్ చేసి ఇస్తే నమ్మకంగా మొదట్లో డబ్బులు చెల్లించాడు. చెక్కులు, నోట్లు ఇచ్చాడు. సరుకు పంపించడం ఆపేశాడు. కార్యాలయం మూసేశాడు.
–అరుణ, నాగరాజు, దుర్గ, ధనలక్ష్మి, సుధారాణి
డ్వాక్రా లీడర్ రూ.4.70 లక్షలతో పారిపోయింది
స్వరాజ్య మహిళా స్వయం సహాయక సంఘం లీడర్ అయిన చౌత్రాకు చెందిన పాలూరి పుల్లమ్మ బ్యాంకులో మేము జమ చేసిన 4,70,000 నగదుతో ఇంటికి తాళం వేసి ఏప్రిల్ నెలలో పారిపోయింది. దీంతో పసుపు కుంకుమ డబ్బులు బ్యాంకు అధికారులు జమ చేసుకున్నారు.
–ప్రభావతి, జేవీఎల్.మాధవిలత, సుజాత, ఆర్.లత
ప్రేమించి మోసం చేశాడు
బ్రాడీపేటకు చెందిన నాకు 2007లో సుధాకర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత మా కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. సుధాకర్ కూడా అక్కడకు వచ్చాడు. ఇరు కుటుంబాలు మా ప్రేమను ఒప్పుకున్నాయి. మొదట ఉద్యోగం, తర్వాత చెల్లి పెళ్లి అని 12 సంవత్సరాలు గడిపాడు. వ్యాపారం పేరుతో సుధాకర్ నా తల్లిదండ్రుల వద్ద, నా వద్ద పలుమార్లుగా రూ.75 లక్షలు వరకు తీసుకున్నాడు. కాలక్రమంలో నా తల్లిదండ్రులు మరణించారు. ఇప్పుడు సుధాకర్, అతని తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు. నాకు న్యాయం చేయాలి.
–బాధితురాలు, బ్రాడీపేట
రైల్వే ఉద్యోగమని నమ్మించారు
ఇంటి సమీపంలో నివసించే పద్మ అనే మహిళ కుతాడి నాగనాంచారయ్యను పరిచయం చేసింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. హైదరాబాదులో ఉండే కసిరెడ్డి దీపక్‌రెడ్డి అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడించాడు. అప్పు చేసి రూ.6 లక్షలు వరకు వారికి ఇచ్చాం. ఉద్యోగం రాకపోతే తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. మార్చిలో ట్రైనింగ్ అంటూ హైదరాబాద్ పిలిచారు. ఓ గదిలో నాతోపాటు మరికొంతమందికి రెండు నెలలు శిక్షణ ఇచ్చారు. అపాయింట్‌మెంట్ లెటర్లు ఇంటికి పంపిస్తామని చెప్పి పంపివేశారు. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. డబ్బులు ఇవ్వలేదు. న్యాయం చేయాలి.
–కుంటిగర్ల ప్రవీణ్, మంగళగిరి మండలం, ఎర్రబాలెం
అర్బన్ కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరిస్తున్న డీఎస్పీ సీతారామయ్య; రూరల్ కార్యాలయంలో అర్జీలు పరిశీలిస్తున్న డీఎస్పీలు లక్ష్మయ్య,రవికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment